
సాక్షి, హైదరాబాద్ : ఆలిండియా సైన్స్ కాంగ్రెస్ వేదికపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు జరగనున్న ఆలిండియా సైన్స్ కాంగ్రెస్‌కు ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశాల ప్రారంభ వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ రానుండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఓయూలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో సమావేశాల నిర్వహణ పై సందిగ్ధత నెలకొంది. ఓయూలో ఉన్న పరిస్థితులు, వరుస ఆందోళనలు, వస్తున్న వార్తల కారణంగా వేదికను మార్చాలని ఆలిండియా సైన్స్ కాంగ్రెస్ కమిటీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
గతేడాది నిర్వహించిన ఉస్మానియా శతాబ్ది వేడుకల్లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సీఎం కేసీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. విద్యార్థులు ఆందోళనకు దిగే వాతావరణం నెలకొనడంతో హడావుడిగా ప్రారంభ సమావేశం ముగించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల మురళి అనే విద్యార్థి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఓయూకు మంగళవారం నుంచి వచ్చే 45 రోజుల పాటు తరగతులకు, హాస్టళ్లకు సెలవులు ప్రకటించారు. వేదికను మరో చోటికి మార్చాలని ఆలిండియా సైన్స్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అచ్యుత సమంతా లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో వేదికను హెచ్‌ఐసీసీకి మార్చాలని అధికారులు యోచిస్తున్నారు.