దిశా ఘటనపై గవర్నర్‌ తమిళిసై ఉద్వేగం | Telangana Governor Tamilisai Reacts On Disha Incident At Tamilnadu | Sakshi
Sakshi News home page

మర్యాద నేర్పుదాం! 

Dec 9 2019 8:55 AM | Updated on Dec 9 2019 8:55 AM

Telangana Governor Tamilisai Reacts On Disha Incident At Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: మహిళల్ని ఏవిధంగా గౌరవించాలి, మర్యాద ఇవ్వాలి అన్న విషయాల్ని మగబిడ్డలకు చిన్న తనం నుంచే నేర్పుదామని తల్లిదండ్రులకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. మొగ్గల్ని తుంచేయ వద్దు...పువ్వుల్ని నలిపేయకండి అంటూ దిశా ఘటనను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమిళనాడు వాణిబర్‌ పేరవై నేతృత్వంలో కోయంబేడులో ఆదివారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో తమిళి సై ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంగా మహిళలకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు పెరుగుతుండటం వేదన కల్గిస్తున్నదన్నారు. దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా, హింస అన్నది మాత్రం తగ్గక పోవడం తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో దిశపై మానవ మృగాళ్లు సాగించిన హింసాత్మక ఘటనను గుర్తు చేస్తూ, ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన మరువక ముందే, ఉత్తరప్రదేశ్‌లో మరో ఘటన వెలుగు చూడటం బట్టి చూస్తే, మహిళలకు భద్రత అన్నది ఆందోళనకు గురి చేస్తున్నదన్నారు. తమిళనాట అశ్లీల వీడియోలను చూసే వారి  సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నట్టు సర్వేలు పేర్కొనడం బట్టి చూస్తే, ఇక్కడ అబలకు భద్రత అన్నది ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. ఇక, హింసాత్మకత ఏమేరకు మహిళల మీద పెరుగుతున్నదో స్పష్టం అవుతోందన్నారు. ఆడ బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నామో, అదే రకంగా మగ బిడ్డల్ని సైతం పెంచాల్సిన పరిస్థితి తల్లిదండ్రుల మీద ఉందన్నారు. మహిళలకు ఏవిధంగా గౌరవాన్ని ఇవ్వాలి, మర్యాద కల్పించాలి..?, వారిని చూసినప్పుడు ఎలా విలువ ఇవ్వాలి.. అన్న విషయాలను  మగ బిడ్డలకు ఉపదేశించి పెంచాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు.

లక్ష్మీ దీపం.. 
వెలుగును ఇచ్చే లక్ష్మీ దీపం ఆడ బిడ్డ అని చెప్పుకునే ఈ సమాజంలో, అదే ఆడ బిడ్డను  కొరివిగా మార్చేస్తుండడం వేదన కల్గిస్తున్న విషయంగా పేర్కొన్నారు. దయ చేసి పువ్వుల్ని వికసించ నివ్వండి.. నలిపేయ వద్దు...మొగ్గల్ని తుంచేయ వద్దు ..అంటూ బొంగర బోయిన గొంతుతో ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు.  ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడ బిడ్డ  మళ్లీ తిరిగి చేరుకోవడం గగనం అవుతున్నదని, ఇక,  ఆత్మరక్షణా శిక్షణ విçస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదే సమయంలో కట్టుబాట్లు కూడా అవశ్యం అన్న విషయాన్ని ప్రతి బిడ్డ గుర్తెరగాలని సూచించారు. సమాజంలో మార్పు అన్నది రావాలని, మహిళకు భద్రత అన్నది పెరగాలని, మర్యాద పెరగాలని ఆకాంక్షించారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement