గర్భిణి మృతిపై గవర్నర్‌ సీరియస్‌ | Telangana Governor Serious on Pregnant Women Deceased | Sakshi
Sakshi News home page

గర్భిణి మృతిపై గవర్నర్‌ సీరియస్‌

Jun 22 2020 12:08 PM | Updated on Jun 22 2020 12:08 PM

Telangana Governor Serious on Pregnant Women Deceased - Sakshi

కోయల్‌పాండ్రి గ్రామంలో వివరాలు తెలుసుకుంటున్న డీఎంహెచ్‌ఓ నరేందర్‌ రాథోడ్, వైద్య బృందం

ఆదిలాబాద్‌టౌన్‌/ఇంద్రవెల్లి: గర్భిణి మృతిపై రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ సీరియస్‌ అయ్యారు. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. నివేదికను అందజేయాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో,  ఇంద్రవెల్లి మండలంలోని కోయల్‌పాండ్రి గ్రామానికి ఆదివారం వెళ్లి వివరాలు సేకరించారు. గర్భిణి పుర్క జయశీల(27) మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ రాథోడ్‌ నరేందర్‌ వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో విచారణ చేపట్టారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు వైద్యసేవల కోసం ఆమెను సంప్రదించారా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందిందా.. అనే విషయాలపై ఆరా తీశారు. అయితే ఈ నెల 19న జయశీల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులు రిమ్స్‌లో ఆందోళన చేపట్టడంతో ఈ విషయం గవర్నర్‌ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన గవర్నర్‌ విచారణకు వైద్య ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు.

పలు కారణాలతో..
ఇంద్రవెల్లి మండలంలోని కోయల్‌పాండ్రికి చెందిన పుర్క జయశీల బీఎస్సీ నర్సింగ్‌ చదివి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేసేది. గర్భం దాల్చడంతో నెలరోజుల క్రితం ఉట్నూర్‌ సీహెచ్‌సీలో వైద్య పరీక్షలు చేయించుకుంది. రక్తహీనత, బీపీ ఎక్కువగా ఉందని ఆదిలాబాద్‌ జిల్లా కేం ద్రంలోని రిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఆమె గర్భంలో కవల పిల్లలు ఉండటంతో ఇబ్బందిగా మారిందని, అయితే ఏఎన్‌ఎంలు, ఆ శ కార్యకర్తలు ప్రతినెల ఆమె ఇంటికి వెళ్లి ఆరోగ్య స్థితులపై ఆరా తీశారు. రక్తహీనత, బీపీ ఎక్కువగా ఉన్నాయని తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం కారణంగా నే నిండు గర్భిణి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని తె లుస్తోంది. ఇదిలా ఉండగా ప్రతి ఏటా  సీజనల్‌ కాలంలో ఏజెన్సీలో మరణాలు సంభవిస్తున్నాయి. అదే విధంగా గ ర్భిణులు  రక్తహీనతతో మృత్యువాత పడుతూనే ఉన్నా రు. అయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కాకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు.

గర్భంలోనే.. కన్నుమూసిన కవలు
పురిటి నొప్పులు రావడంతో గర్భిణిని పిట్టబొంగరం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగా లేక వైద్యుల సూచన మేరకు 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. రెండు రోజుల పాటు రిమ్స్‌లో చికిత్స పొందిన ఆమె సరైన వైద్యం అందక మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణితో పాటు గర్భంలోని ఇద్దరు కవల పిల్లలు కన్నుమూశారని రిమ్స్‌ ఎదుట ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. జిల్లా అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేస్తామని భరోసా కల్పించడంతో ఆందోళనను విరమింపజేసిన విషయం విదితమే.

రిమ్స్‌లో ప్రత్యేక సెల్‌..
జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. ఆదివాసీలకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించడానికి ప్రత్యేకంగా లైజన్‌ అధికారిని నియమించడం జరిగిందని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందకపోయిన, ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే సెల్‌: 6281986250కు సమాచారం అందించాలని సూచించారు. రిమ్స్‌ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో సందర్శించి రోగులకు వైద్యం అందించాల తెలిపారు. ఆయన వెంట ఏజెన్సీ అడిషనల్‌ డీఎంహెచ్‌వో మనోహర్, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సాధన, హరీష్‌కుమార్, వైద్య సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా సకాలంలో వైద్యులు స్పందించి ఉంటే తమ బిడ్డ జయశీల ప్రాణాలతో ఉండేదని మృతిరాలి కుటుంబీకులు విచారణకు వెళ్లిన అధికారుల ఎదుట కంటతడి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement