
20 వేలకు పైగా పోస్టులు
రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థల్లో 20 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, వీలైనంత త్వరలో నియామకాలు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
► జూన్ 2న నోటిఫికేషన్ జారీ చేయనున్న గురుకుల పోస్టులు 2,437
► త్వరలో ప్రకటించనున్న స్కూల్ టీచర్ పోస్టులు 8,792
► కేజీబీవీల్లో నియామకాలు 1,428
► భర్తీ ప్రక్రియ వేగవంతం చేయండి: కేసీఆర్
► టీఎస్‌పీఎస్సీ, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థల్లో 20 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, వీలైనంత త్వరలో నియామకాలు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నియామకాల ప్రక్రియ వారంలోగా ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి సంబంధించి మంగళవారం ప్రగతి భవన్లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వివిధ విద్యా సంస్థల్లో నియామకాలకు సంబంధించి కొన్నింటికి నోటిఫికేషన్ జారీ చేశామని, మరికొన్నింటికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎంకు చక్రపాణి వివరించారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో 2,437 పోస్టులకు రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. వీటిలో లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు, సివిల్ ఇంజనీర్లు, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులున్నాయి. వీటి నియామకాలు కూడా త్వరలోనే జరపాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 8,792 టీచర్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించారు.
కేజీబీవీల్లో 1,428 పోస్టులు
రాష్ట్రంలో కొత్తగా 84 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ప్రారంభం కానున్నాయి. వీటిలో 1,428 ఉద్యోగాలు అవసరం కాగా.. 840 మంది బోధన, 588 మంది బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారు.
అర్బన్ రెసిడెన్షియల్స్‌లో 377 ఉద్యోగాలు
కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలను కలుపుకుని మొత్తం 29 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 377 పోస్టుల నియామకానికి అనుమతించినట్లు సీఎం చెప్పారు. వీటిలో 174 మంది బోధన, 203 మంది బోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,300 టీచర్లు
ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,300 మంది టీచర్ల నియామకానికి ఈ నెల 31న పరీక్ష నిర్వహించనున్నారు. ఆలస్యం చేయకుండా ఈ నియామకాలు జరపాలని సీఎం ఆదేశించారు.
ఉద్యోగాల నియామకాలపై నిరంతర సమీక్ష
ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ఏర్పడే ఖాళీలను గుర్తించి, వాటి భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవడానికి నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎప్పటికప్పుడు సంప్రదించి, అధికారుల సమన్వయంతో ఖాళీలను గుర్తించి, పోస్టులను భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ చక్రపాణికి సూచించారు.