జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

Telangana Government Urged to Provide Life Insurance to Journalists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జర్నలిస్టులందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. సోమవారం బీఆర్కే భవన్‌లో మంత్రిని కలిసిన అల్లం నారాయణ వినతి పత్రాన్ని అందజేశారు. పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని వారందరికీ విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు.  విధి నిర్వహణలో భాగంగానే టీవీ విలేకరి మనోజ్‌ కుమార్‌ కరోనాతో మృతి చెందాడని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి జర్నలిస్టుకు కరోనా కిట్‌ (మాస్క్, సానిటైజర్, పీపీఈ కిట్, గ్లౌజ్‌) సరఫరా చేయాలని కోరారు.

జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్‌ కార్డులతో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా, టెస్ట్‌లకు వర్తించేలా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు రూ.20 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని అన్నారు. ఇందుకు మంత్రి ఈటల సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టులందరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ అధ్యక్షులు సయ్యద్‌ ఇస్మాయిల్, చిన్నపత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్‌ బాబు, జర్నలిస్టుల సంఘాల నాయకులు నవీన్‌ కుమార్, పార్థ సారధి తదితరులు పాల్గొన్నారు.   

మనోజ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ఐజేయూ, టీయూడబ్ల్యూజే డిమాండ్‌

హిమాయత్‌నగర్‌: విధి నిర్వహణలో కరోనా కాటుకు బలైన టీవీ జర్నలిస్ట్‌ మనోజ్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన తప్పదని ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్‌ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్‌ శ్రీకాంత్‌లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మనోజ్‌ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం జర్నలిస్టులను ఆందోళనకు గురి చేసిందన్నారు. కరోనా మహమ్మారిని నివారించడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల మాదిరిగానే అత్యవసర విభాగంలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు కూడా రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని ఆదినుంచీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top