ప్రతిష్టాత్మకం ‘ప్రగతి నివేదన’!

Telangana Government Schemes All Important Rajendra Karimnagar - Sakshi

సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేతలకు సైతం ప్రతిష్టాత్మకంగా మారింది. హైదరాబాద్‌ శివారు కొంగరకలాన్‌లో నిర్వహించే ఈ సభకు జనసమీకరణ లక్ష్యం 25 లక్షల మంది కాగా.. ఉమ్మడి కరీంనగర్‌ నుంచి 2.50 లక్షల మందిని తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందుకోసం సుమారు 3,500 వాహనాలు అవసరం ఉంటాయని భావిస్తున్నారు. ఇదే విషయమై శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ అధికార నివాసంలో భేటీ అయిన 13 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు జనసమీకరణపై కీలకంగా చర్చించారు. సభ సక్సెస్‌ కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 25 వేలకు తగ్గకుండా జన సమీకరణ చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ మార్గదర్శనం చేశారు. ఇదే క్రమంలో ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న  మంత్రులు, ఎమ్మెల్యేలు కాకుండా జనసమీకరణ కోసం 13 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: దేశంలోనే చారిత్రాత్మకంగా చేపట్టే ప్రగతి నివేదన భారీ బహిరంగ సభలో నాలుగేళ్లలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటి అమలును ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రభుత్వానికి కీలకంగా ఉన్న పూర్వ కరీంనగర్‌  ‘నివేదన’ సదస్సు సక్సెస్‌లో ముందుండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశ చిత్రపటం మీద సమున్నత స్థానాన్ని సంపాదించుకున్న తీరు.. ఇందుకోసం ప్రభుత్వం తీసుకున్న బృహత్తర పథకాల అమలును తెలపనున్నారు. రాష్ట్రం విడిపోయిన రోజు ‘తెలంగాణవారికి చదువులేదు.. సంస్కారం లేదు.. పాలన చేతకాదు.. కరెంటు లేదు.. నీళ్లు రావు’ అని ఎద్దేవా చేసినవారి నోళ్లు మూయించేలా ప్రభుత్వం గొప్ప సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు చేరువవడం వెనుకు ఉన్న కష్టసుఖాలను పంచుకోనున్నారు. ఇందులో ఉత్తర తెలంగాణకు కీలకమైన కరీంనగర్‌లో కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ప్రగతిని వివరించనున్నారు.

కరీంనగర్‌ నుంచి మొదలై 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ కాలంలో ఒడిదుడుకులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సత్తా చాటుకుని నిలబడిన విషయాలను ప్రజల ముందుంచనున్నారు. దేశ చరిత్రలో ప్రగతి నివేదికతో ప్రభుత్వాలు ప్రజల ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. ఇలాంటి కనీవిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న బహిరంగసభకు ఉమ్మడి జిల్లా నుంచి 2.50 లక్షల మందిని తరలించేందుకు చేస్తున్న జన సమీకరణలో పార్టీలో కింది స్థాయి నుంచి ముఖ్యనేతల వరకు అందరినీ భాగస్వామ్యం చేయనున్నారు. టార్గెట్‌ను చేరుకునేందుకు మంత్రి ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ప్రజల  హాజరు, రవాణా ఏర్పాట్లు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో బేటీలు జరుగుతున్నాయి.
 
జనసమీకరణకు æఇన్‌చార్జిలు.. 13 నియోజకవర్గాలకు బాధ్యులు
కరీంనగర్‌కు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మానకొండూర్‌కు సుడా చైర్మన్‌ జీవీ.రామకృష్ణారావు, హుస్నాబాద్‌కు ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, కోరుట్లకు ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, జగిత్యాలకు ఎమ్మెల్సీ బానుప్రసాద్‌రావు, మంథనికి కర్ర శ్రీహరి, వేములవాడకు మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, ధర్మపురికి పోలీస్‌ హౌసింగ్‌బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్, పెద్దపల్లికి జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, రామగుండంకు మైనార్టీ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్, చొప్పదండికి గూడూరి ప్రవీణ్, హుజూరాబాద్‌కు బండ శ్రీనివాస్, సిరిసిల్లకు టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావును నియమించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతి ఇంటికీ చేరువయ్యేందుకే కృషి చేసిందని చెప్పవచ్చు.

మేనిఫెస్టోను భగవద్గీతలాగా భావిస్తామని సీఎం కేసీఆర్‌ పలుమార్లు ఉద్ఘాటించారు. మేనిఫెస్టోలో ఉన్న అంశాలను మెజారిటీగా నెరవేర్చడంతోపాటు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్‌భగీరథ, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలకు ఫించన్లు వంటి ఫథకాలను అమలు చేసిన ఘనత తమకే దక్కిందంటూ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ ఎప్పుడు పిలుపు ఇచ్చినా పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపిన కరీంనగర్‌ ప్రజలు మరోసారి ప్రగతి నివేదన సభకు భారీగా తరలివస్తారని పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు.  

చారిత్రాత్మకంగా నిర్వహిస్తాం: ఆర్థిక శాఖ మంత్రి ఈటల
కరీంనగర్‌కార్పొరేషన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభ దేశంలోనే చారిత్రాత్మకమని, సభకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో ఏ పార్టీ నిర్వహించని రీతిలో సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ శివారులోని కొంగరకలాన్లో 25లక్షల మందితో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని దేశ చిత్రపటంపై సముచిత స్థానంలో నిలిపేలా సభ నిర్వహిస్తామని వెల్లడించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం ఆచరణలో ముఖ్యమంత్రి 300కు పైగా నిర్ణయాలు తీసుకుని జీవోలు జారీ చేశారని తెలిపారు.

ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబుల్‌లా పాటించామని 99.9 శాతం హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. మేనిఫెస్టోలో లేని పథకాలూ అమలు చేస్తున్నా మన్నారు.  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి 2.5 లక్షల మంది ప్రజలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అందుకుగాను 1250 ఆర్టీసీ బస్సులను తీసుకున్నామని, 150 ప్రైవేటు బస్సులు, 1200 స్కూల్‌ బస్సులు జిల్లాలో రాజకీయ నాయకుల వాహనాలలో కూడా ప్రజలను సభకు తరలించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్సీ శరత్‌రావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బొడిగె శోభ, నగర డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top