నిధుల విడుదలలోనూ‘వెనుకబాటే’! | telangana government neglegency for funds releasing | Sakshi
Sakshi News home page

నిధుల విడుదలలోనూ‘వెనుకబాటే’!

Jan 26 2015 2:07 PM | Updated on Mar 28 2018 11:11 AM

వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమశాఖను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమశాఖను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు ఉపకారవేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల సంక్షేమ నిధుల విడుదలలో భాగంగా ప్రభుత్వం అన్ని కేటగిరీలకు నిధులివ్వాల్సి ఉన్నప్పటికీ.. కేవలం సాంఘిక, గిరిజన సంక్షేమశాఖలకు మాత్రమే అవసరం మేరకు నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలకు దాదాపు రూ.72.7 కోట్లు రిలీజ్ చేయగా.. వెనుకబడిన తరగతులకు మాత్రం ఉత్తి చేతులే చూపింది.
 
 బకాయిలు రూ.214.26 కోట్లు
 
 బీసీ సంక్షేమశాఖలో బకాయిలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కొత్తగా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరించకున్నా.. గత బకాయిలు, సీనియర్లకు ఇవ్వాల్సిన కోటాకు సంబంధించి నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో ఎస్సీ విద్యార్థులు 18,535 మంది చదువుతుండగా, ఎస్టీ విద్యార్థులు 6,690 మంది వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. అయితే వీరికంటే పది రెట్ల మంది బీసీలున్నారు. బీసీ సంక్షేమశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 2,06,013 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులు పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్నారు. వీరికి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 2014-15 సంవత్సరానికి గాను రూ. 388.77 కోట్లు అవసరమని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.174.51 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా రూ. 214.26 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది.
 
 ఫ్రెషర్స్ ఊసేది?
 
 సీనియర్ విద్యార్థుల బకాయిలే రూ.కోట్లలో పెండింగ్ ఉండగా.. వివిధ కోర్సుల్లో కొత్తగా చేరిన విద్యార్థుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 2014-15 సంవత్సరానికి సంబంధించి కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థుల నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించలేదు. సాధారణంగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయితే.. అక్టోబర్ నెలాఖరు వరకు దరఖాస్తుల పరిశీలనను అధికారులు పూర్తిచేసేవారు. కానీ ఈ దఫా ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ఊసెత్తకపోవడంతో విద్యార్థులకు ఉపకారవేతనాలపై తీవ్ర అయోమయం నెలకొంది. అంతేకాకుండా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కళాశాల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement