రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మెదక్ జిల్లా అందోలు....
జోగిపేట: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మెదక్ జిల్లా అందోలు నియోజకవర్గం పరిధిలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామానికి చెందిన వెంకమోళ్ల నాగిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వి.నాగిరెడ్డి ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నాగిరెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా వి.నాగిరెడ్డి పనిచేస్తున్నారు.
వాస్తవానికి ఆయన 2015 ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావాలంటే తప్పనిసరిగా పదవీ విరమణ చేయాలన్న నిబంధన ఉండడంతో నాగిరెడ్డిఅందుకు కూడా సిద్ధమయ్యారు.
విద్యాభ్యాసం
నాగిరెడ్డి స్వగ్రామమైన పెద్దారెడ్డిపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు జోగిపేట ఉన్నత పాఠశాల, ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్ కళాశాలలో అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విద్యాలయంలో ఏజీ బీఎస్సీ పూర్తి చేశారు.
బెంగుళూరులోని కళాశాలలో ఎమ్మెస్సీలో చేరారు. అనంతరం సివిల్స్ రాసి 1979-80లో ఐఎఫ్‌ఎస్ కర్ణాటక కేడర్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం మంగళగిరి డీఎఫ్‌ఓగా పనిచేశారు. అలా ఏడాదిన్నర డీఎఫ్‌ఓగా పనిచేసిన ఆయన, అనంతరం రెండో ప్రయత్నంగా ఐపీఎస్ కేడర్‌కు ఎంపికయ్యారు. అయితే ఎలాగైనా ఐఎఎస్ కావాలనుకున్న నాగిరెడ్డి 1984లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
నిర్వహించిన పదవులు
1982లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు.
1984లో సివిల్స్‌లో ఐఏఎస్‌గా ఎంపిక
1984లో కొత్తగూడెం, పెనుగొండ సబ్‌కలెక్టర్‌గా
1988-89లో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా,
1989-91లో రంగారెడ్డి జిల్లా డీఆర్‌డీఏ పీడీగా,
1991-92లో హార్టికల్చర్ రాష్ట్ర డెరైక్టర్‌గా
1992-95లో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.
1995లో కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్‌గా, 96-97లో అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ జాయింట్ సెక్రటరీగా, 1997-98లో కడప కలెక్టర్‌గా 1999-2000లో ఏపీ రాష్ట్ర మార్కెటింగ్ ఎండీగా, 1999లో పంచాయతీ రాజ్ కమిషనర్‌గా, సహకార శాఖ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. 2004లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గిరిజన, సంక్షేమ, పర్యాటక శాఖలకు అధికారిగా వ్యవహరించారు. సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలోనూ పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల ప్రధాన కార్యదర్శిగా, ఎన్జీరంగా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.