మిడతను మడతేద్దాం..!

Telangana Government Alert on Locust Attack - Sakshi

రాకాసి పురుగుపై అధికారులు అప్రమత్తం

టోల్‌ఫ్రీ నం. 1800 120 3244 ఏర్పాటు

రసాయనాలు, యంత్రాలు సిద్ధం

అవగాహన కల్పిస్తున్న యంత్రాంగం

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): పంటలను నాశనం చేసే రాకాసి మిడత ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో మిడతల గుంపు మూకుమ్మడి భీభత్సం సృష్టించగా పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఇప్పటికే మిడత(లోకస్ట్‌)ల దాడికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. మహారాష్ట్ర ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు సరిహద్దు కావడంతో తమకు కూడా ముప్పు తప్పదని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రభుత్వం ఇప్పటికే మిడతల నుంచి తలెత్తే ప్రమాదాన్ని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు జిల్లా, మండల వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. గంటకు 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించే మిడతల దండు మూడు కిలోమీటర్లకు పైగా విస్తరించి దాడి చేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. మిడతలు జిల్లాకు చేరితే పచ్చని పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. జిల్లాలో సాగవుతున్న కూరగాయలు, మామిడిపండ్లు, ఇతర పంటలకు ప్రమాదం పొంచి ఉంది. మిడతల దండుకు పచ్చదనం కనిపిస్తే దాడిచేసి కనబడకుండా చేస్తాయి. వాటినుంచి అప్రమత్తంగా ఉంటూ పంటను రక్షించుకునేలా అధికారులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. అవసరమైన రసాయనాలు, యంత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫైరింజన్లు కూడా సిద్ధంగా ఉంచారు.(టోల్‌ఫ్రీ నం. 1800 120 3244 )

నివారణకు సూచనలు
మిడతలు పంట పొలాలవైపు రాకుండా ముందస్తుగానే డబ్బాలు, స్టీల్‌ ప్లేట్లు, డ్రమ్ములు, లౌడ్‌స్పీకర్లతో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలా చేయాలి.
15 లీటర్ల నీటికి 45 మిల్లీలీటర్ల వేప రసాయనాలను కలిపి పిచికారీ చేయాలి.
క్వినోల్‌పాస్‌ 1.5 శాతం డీపీ గానీ, క్లోరోఫైరోపాస్‌ 105 శాతం డీపీ పొడి మందును హెక్టారుకు 25 కిలోల చొప్పున చల్లి, పొలాన్ని దున్నితే మిడతల గుడ్లు, వాటి పిల్ల పురుగులు అక్కడికక్కడే నాశనమవుతాయి.
ఎండిన పొలాల్లో లేదా చుట్టుపక్కల మంటలు వేస్తే మిడతల దండు, పిల్ల దశ పురుగులు మంటల్లో పది శాతం వరకు నశించిపోతాయి. రైతులు ఈ మార్గదర్శకాలను పాటిస్తే కొంత మేరకైనా పంటలను కాపాడుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top