అడవికి ‘రక్షణ’! 

Telangana Forest Officer New System Nizamabad - Sakshi

స్మగ్లర్లు, వేటగాళ్ల బారి నుంచి అడవులతో పాటు వన్యప్రాణులను కాపాడేందుకు సర్కారు గట్టి చర్యలు చేపట్టింది. వన సంపద సంరక్షణకు పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇకపై పోలీసు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయనున్నారు. 

సాక్షి, కామారెడ్డి: అడవుల రక్షణకు ఇంతకాలం అటవీ శాఖ అధికారులు మాత్రమే చర్యలు తీసుకునేవారు. అయితే అడవులను నరికివేసి పెద్ద ఎత్తున పోడు వ్యవసాయం చేయడంతో పాటు కలపను అక్రమంగా తరలించడం, వన్యప్రాణుల వేట య«థేచ్ఛగా సాగుతున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు అటవీశాఖకు పోలీసు శాఖ దన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అడవులు, వన్యప్రాణుల రక్షణకు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ శ్వేత అటవీ, పోలీసు అధికారులను ఆదేశించారు.  జిల్లాలో మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, బాన్సువాడ తదితర మండలాల పరిధిలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది.

అయితే రెండు దశాబ్దాలుగా అడవులను విచ్చలవిడిగా నరికివేస్తూ భూముల్లో పోడు వ్యవసాయ చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు దట్టమైన అడవులుగా గుర్తింపు ఉన్న ప్రాంతాలన్నీ ఇప్పుడు బయళ్లుగా మారాయి. అడవులు అంతరించిపోతుండడంతో వన్యప్రాణులకు కూడా రక్షణ కరువైంది. దాహం తీర్చుకునేందుకు, తిండి కోసం వన్యప్రాణులు బయటకు రాగానే వేటగాళ్ల ఉచ్చులో చిక్కి బలవుతున్నాయి. అటు అడవులను స్మగ్లర్లు, ఇటు వన్యప్రాణులను వేటగాళ్లు బలిచేస్తుండడంతో సర్కారు రంగంలోకి దిగింది.

హరితహారం పేరుతో ఏటా కోట్లాది మొక్కలు నాటుతుంటే మరోవైపు అడవుల నరకివేత పెరగడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అడవులను కాపాడేందుకు అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా అడవుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ శ్వేత ఇటీవల పోలీస్, అటవీ శాఖల అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. పదేపదే కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వేట కొనసాగిస్తూ పట్టుబడేవారిపై పీడీ యాక్ట్‌ కూడా నమోదు చేయడానికి వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.
 
సమన్వయంతో సాగితే.. 
అటవీశాఖ ఉద్యోగులకు ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో స్మగ్లర్లు గతంలో పలుమార్లు దాడులకు తెగబడ్డారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన పలు సంఘటనల్లో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు తీవ్ర గాయాలపాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధాలు సమకూర్చడం, వాటిని నిర్వహించడం ఇబ్బందికర పరిస్థితి కావడంతో ప్రభుత్వం పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. దీంతో కలప అక్రమ నిల్వలపై దాడులు చేసే సమయంలో పోలీసుల సహకారం తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది.

ఇరు శాఖల అధికారులు, సిబ్బంది కలిసి దాడులు నిర్వహిస్తే స్మగ్లర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పోలీసులంటే ప్రజలకు ఒకింత భయం ఉండడంతో పాటు వారి చేతుల్లో ఆయుధాలు కూడా ఉండడం వల్ల వారిపై దాడులకు దిగడానికి ముందుకు రారు. దీంతో కలప స్మగ్లర్ల ఆటకట్టించడం సులవవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే కొత్తగా ఎవరూ అటవీ భూములను ఆక్రమించుకోకుండా అడ్డుకోవడానికి కూడా పోలీసు, అటవీ శాఖల సమన్వయం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది పోలీసులు సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top