గడువు.. మూడు రోజులే! | Sakshi
Sakshi News home page

గడువు.. మూడు రోజులే!

Published Sun, Sep 23 2018 2:25 PM

Telangana Election Voter Online Application Nalgonda - Sakshi

నల్గొండ : ఓటుహక్కు నమోదుకు ఇక.. మూడు రోజులే గడువు ఉంది. నిర్ణీత సమయంలోగా నమోదు చేసుకోకపోతే విలువైన ఓటు హక్కుకు దూరమవుతారు. ఎన్నికల సంఘం 2018 జనవరి 1 నాటి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ నెల 10న రెండవ ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసింది. కానీ, జిల్లాలో యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి పెద్దగా స్పందించలేదు. దీంతో అధికార యంత్రాంగం ఓటుహక్కు నమోదుపై పట్టణాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నెల 15,16 తేదీల్లో పోలింగ్‌ బూత్‌లలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిం చింది. ఏడు వేల పైచిలుకు కొత్త ఓటర్లుగా నమో దు చేసుకున్నారు. కొంతమంది ఆన్‌లైన్‌లో, మరి కొంత మంది అధికారుల వద్ద నమోదు చేసుకుం టున్నారు. ఈ నెల 25 వరకు మాత్రమే ఓటుహ క్కు నమోదుకు గడువు విధించారు. ఈలోగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడూ తమ ఓటు నమోదు  చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
 
నేడు ఇంటింటికీ సర్వే.. 
ఓటు నమోదుకు మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆదివారం ఇంటింటికి సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల అధికారులు, గ్రామాల ప్రత్యేక అధికారులు.. మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించి వారి ద్వారా ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.  ఈ మేరకు ఆదివారం సర్వే నిర్వహించనున్నారు. ఓటరు జాబితాను ఇంటింటికీ తీసుకెళ్లి అందులో వారి ఓటు ఉందా..లేదా చూడడంతోపాటు ఆ ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుల పేర్లు నమోదు చేయనున్నారు. అన్ని గ్రామాల్లో ఉదయంనుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
 
ఈ..మూడురోజులే... 
ఓటు నమోదుకు మూడు రోజులు మాత్రమే అవకాశం ఉన్నందున అధికారులు కూడా పెద్దఎత్తున కళాశాలల్లో క్యాంపులు నిర్వహంచి ఓటు నమోదు చేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. శుక్రవారం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పట్టణంలో జేసీ నేతృత్వంలో ఓటు నమోదుపై ర్యాలీ తీశారు. ఈ మూడు రోజులపాటు పెద్దఎత్తున కొత్త ఓట్ల నమోదు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

మరిచారో ...అంతే .. 
ఓటు..పౌరులకు  రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇంతటి విలువైన ఆయుధాన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది వినియోగించుకోలేక పోతున్నారు. మా ఓటు ఉంది కదా అని ఊరుకుంటున్నారు. తీరా ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వెళ్తే.. గల్లంతు అయ్యిందని తెలియడంతో ఇబ్బంది పడుతున్నారు. ముందస్తుగానే ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందా.. లేదా.. «ఏదైనా పేర్లు తప్పులు దొర్లాయా చూసుకోవాల్సి అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

కొత్త ఓట్ల నమోదు..
జిల్లాలో ఇప్పటివరకు 7,989 మంది కొత్తగా ఓటుహక్కుకు నమోదు చేసుకున్నారు. 4,247మందికి ఓట్ల తొలగింపు నోటీసులు పంపనున్నారు. 1891మంది తమ ఓటర్ల జాబితాలో తన పేరు, ఇంటి ఆడ్రస్‌లలో తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక బూత్‌నుంచి మరో బూత్‌కు ఓటు బదలాయించాలని 3,440 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

ఓటు నమోదు చేసుకోవాలి
నకిరేకల్‌ : 18 ఏళ్లు నిండిన  ప్రతి ఒక్కరూ ఓ టు నమోదు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అదనపు  ప్రాజెక్టు డైరెక్టర్‌ మెంచు రమేష్‌ అన్నారు. నకిరేకల్‌లో మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో శనివారం నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈనెల 23న జిల్లా వ్యాప్తంగా గడప గడపకు ఓటర్‌ నమో దు కార్యక్రమం చేపట్టే విధంగా కలెక్టర్‌ ప్రణా ళిక రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు చురుగ్గా పాలొ ్గనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య కోఆర్డినేటర్‌ పి.ప్రభాకర్, సిసిలు, వీఓఏలు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

1/1

ఓటునమోదు అవగాహన ర్యాలీలో పాల్గొన్న మెంచు రమేష్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement