ప్రచార వేడి

Telangana Election Campaign All Parties Leaders Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల పర్యటన ఖరారైంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్‌లలో ప్రచారం నిర్వహించనున్నారు. గ్రూపు రాజకీయాలకు వేదికైన కాంగ్రెస్‌ పార్టీలో ప్రచారం సైతం అదే రీతిన సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క హెలికాప్టర్‌ ద్వారా ఆసిఫాబాద్, సిర్పూరులలో ప్రచారం నిర్వహించిపోగా, తాజాగా ఆదివారం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా సుడిగాలి పర్యటనలు జరపనున్నారు.

రేవంత్‌ ప్రచారం చేసే మూడు స్థానాలు కూడా తన వర్గంగా ఉన్న అభ్యర్థుల కోసమే కావడం గమనార్హం. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆసిఫాబాద్‌లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు నిర్వహిస్తున్న ప్రచార సభలో పాల్గొంటారు. ఇక్కడ రోడ్‌షోతో పాటు బహిరంగసభ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బోథ్‌ నియోజకవర్గంలో తనతో పాటు కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు అభ్యర్థిత్వానికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడినుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు ఖానాపూర్‌లో సాగే బహిరంగసభలో పాల్గొననున్నారు. ఖానాపూర్, బోథ్‌లలో ఈనెల 22న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మూడు చోట్ల ఏర్పాట్లు చేపట్టారు.

పశ్చిమాన అమిత్‌షా... తూర్పున పరిపూర్ణానంద
భారతీయ జనతాపార్టీ ఎన్నికల ప్రచారానికి ఆకర్షణలను అద్దుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల ప్రచారం ఖరారు కాగా, ఆదివారం మధ్యాహ్నం నిర్మల్‌ రాబోతున్నారు. ముక్కోణపు పోటీ నెలకొన్న నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి సువర్ణరెడ్డి తరుపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఈనెల 28న ఆదిలాబాద్‌లో పాయల్‌ శంకర్‌ ఎన్ని కల ప్రచార సభలో పాల్గొంటారు. అమిత్‌షా ప్రచార సభ జరుగుతున్న సమయంలోనే మంచిర్యాల, సిర్పూరు, చెన్నూర్‌ నియోజకవర్గాలకు ఇటీవలే పార్టీలో చేరిన స్వామి పరిపూర్ణానంద విచ్చేస్తున్నారు. లక్సెట్టిపేట, చెన్నూర్, కాగజ్‌నగర్‌లలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సభల కోసం ప్రత్యేక హెలికాప్టర్‌లో నేతలు రానున్నారు. ఈ మేరకు నిర్మల్, లక్సెట్టిపేట, కాగజ్‌నగర్‌లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top