పల్లెకు ప్రగతి

Telangana Budget Session On Panchayat Raj And Rural Development Department - Sakshi

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు భారీగా నిధులు

23,005.35 కోట్లు.. బడ్జెట్‌లో కేటాయించింది..

57 ఏళ్లు ఆసరా పింఛన్ల అర్హత వయసు..

574 కోట్లు.. ఆర్థిక సంఘం నిధులు పెంపు అధికం.. 

సాక్షి, హైదరాబాద్‌: పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దండిగా నిధులు కేటాయించింది. గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కారు.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23,005.35 కోట్లను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా రూ.7,880.46 కోట్లు అధికం. కాగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,701.04 కోట్లు నిర్వహణ పద్దు కాగా, రూ.18,304.31 కోట్లు ప్రగతి పద్దు. వ్యవసాయం తర్వాత అత్యధిక నిధులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దక్కడం విశేషం.

ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లు
అసహాయులైన పేదలకు ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను ఆసరా పథకం కింద రూ.11,758 కోట్లను ప్రతిపాదించింది. గతేడాది రూ.9,402 కోట్లు కేటాయించగా.. ఈసారి అదనంగా మరో రూ.2,356 కోట్లను బడ్జెట్‌లో పొందుపరిచింది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించనుండటంతో లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 39.41 లక్షల మందికి ఆసరా పింఛన్‌ అందుతుండగా.. అర్హత వయసు తగ్గింపుతో మరో ఏడెనిమిది లక్షల మంది అదనంగా పింఛన్‌కు అర్హత సాధించే అవకాశముంది.

దండిగా ఆర్థిక సంఘం నిధులు..
గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. ఇప్పటికే ప్రతినెలా రూ.339 కోట్లు కేటాయిస్తున్న సర్కారుకు ఈ నిధుల రాకతో వెసులుబాటు కలుగనుంది. ఈ నేపథ్యంలో 2020–21లో గ్రామ పంచాయతీలకు రూ.1,393.93 కోట్ల ఆర్థిక సంఘం నిధులను అందించనుంది. గతేడాది కేవలం రూ.819.44 కోట్లు కేటాయించగా.. ఈ సారి అదనంగా రూ.574.49 కోట్లు పెంచింది.

వడ్డీలేని రుణాల్లో కోత
డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ రుణాలకు స్వల్పంగా కోత పెట్టింది. గతేడాది రూ.680.49 కోట్లు కేటాయించగా.. ఈ సారి 679.23 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో జరిగే పనులకు రూ.54 కోట్లు కేటాయించింది. 2019–20తో పోలిస్తే రూ.13 కోట్లు అదనం. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కింద రూ.15.09 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే రూ.11 కోట్లు అధికం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top