స్పీకర్‌ ఎవరో తేలేది నేడే..

Telangana Assembly Speaker Will Be Decided Today - Sakshi

అభ్యర్థిపై సీఎం వ్యూహం

నామినేషన్‌ వేసే వరకు ప్రకటించకుండా సస్పెన్స్‌

పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌

ఏకగ్రీవం కోసం విపక్ష నేతలకు ఫోన్‌

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ కొత్త స్పీకర్‌ ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్‌ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరిని ఎంపిక చేస్తారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. స్పీకర్‌ అభ్యర్థి విషయంలో సీఎం చివరివరకు ఎలాంటి ప్రకటన చేయకూడదని భావిస్తున్నారు. స్పీకర్‌ అభ్యర్థిగా ప్రకటించే ఎమ్మెల్యేతోనూ ఇప్పటివరకు ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ చర్చించలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరం స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ షెడ్యూల్‌ విడుదలవుతుంది. ఎమ్మెల్యే ప్రమాణం అనంతరం మధ్యాహ్న భోజన కార్యక్రమం ఉంటుంది. తరువాత నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదవుతుంది. ఎమ్మెల్యేల ప్రమాణం అనంతరం స్పీకర్‌ అభ్యర్థిని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యేల్లో మాత్రం ఈ విషయంపై ఆందోళన ఎక్కువవుతోంది.

పరిశీలనలో పలువురి పేర్లు..
స్పీకర్‌ పదవి కోసం సీఎం కేసీఆర్‌ పలువురు సీనియర్‌ ఎమ్మెల్యేల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌), ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌), డీఎస్‌ రెడ్యానాయక్‌ (డోర్నకల్‌), మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌), మాజీ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి) ఉన్నారు. సామాజిక సమీకరణలు, సభ నిర్వహణలో సమర్థతను అంచనా వేసి అభ్యర్థి విషయంలో తుది ప్రకటన చేయనున్నారు.

ఏకగ్రీవం కోసంకేసీఆర్‌ విజ్ఞప్తి
అసెంబ్లీ స్పీకర్‌ పదవి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లతో బుధవారం సాయంత్రం సీఎం ఫోన్‌లో మాట్లాడారు. స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేసే అంశంపై ప్రతిపాదించారు. కేసీఆర్‌ ప్రతిపాదనకు అసదుద్దీన్‌ ఓవైసీ, లక్ష్మణ్‌ వెంటనే అంగీకారం తెలిపారు. పార్టీతో చర్చించి గురువారం ఉదయం తమ నిర్ణయం ప్రకటిస్తామని ఉత్తమ్‌ బదులిచ్చారు. టీఆర్‌ఎస్‌కు శాసనసభలో భారీ ఆధిక్యత ఉంది. స్పీకర్‌ ఎన్నిక లాంఛనమే అయినా సంప్రదాయం ప్రకారం సీఎం కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top