రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి సహకరిస్తాం

Tehri Hydro Electric Power Development Corporation Support Rock Fill Dam - Sakshi

‘తెహ్రీ’ కార్పొరేషన్‌ ఈడీ రాజీవ్‌ వైష్ణోయ్‌ వెల్లడి

అధికారుల వినతి మేరకు పాలమూరు పథకం పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రతిపాదిస్తున్న రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి అవసరమైన డిజైన్, ఇతర సాంకేతిక సలహాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెహ్రీ హైడ్రో పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ వైష్ణోయ్‌ తెలిపారు. ఈ తరహా డ్యామ్‌ నిర్మాణ అధ్యయనం కోసం రాష్ట్ర ఇంజనీర్లను మరోమారు తెహ్రీకి పంపించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు లాంటి భారీ ఎత్తిపోతల పథకాలను చేపట్టడం ఒక సాహసోపేతమైన నిర్ణయమని.. ఇక్కడి పరిస్థితులకు ఎత్తిపోతల పథకాలే శరణ్యమని చెప్పారు. భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టడం సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనమన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్లాపూర్‌ రిజర్వాయర్‌లో రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి సాగునీటి శాఖ అధ్యయనం జరుపుతున్న సంగతి తెలిసిందే.  

జలసౌధలో సమావేశం.. 
గతేడాది ఈఎన్‌సీ మురళీధర్‌ నేతృత్వంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నిర్మాణమైన తెహ్రీ డ్యాంను సందర్శించి, అక్కడ రాజీవ్‌ తదితర ఇంజనీర్లతో తెహ్రీ డ్యామ్‌ డిజైన్, నిర్మాణం తదితర సాంకేతిక అంశాలపై చర్చించారు. తెలంగాణకు వచ్చి తమకు కూడా సాంకేతిక సలహాలు ఇవ్వాలని, రాక్‌ఫిల్‌ డ్యామ్‌ డిజైన్లను తమకు అందించాలని కోరారు. రాష్ట్ర ఇంజనీర్ల అభ్యర్థన మేరకు రాజీవ్‌ వైష్ణోయ్‌ బుధవారం పాలమూరు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం గురువారం జలసౌధలో ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఇందులో తెహ్రీ డ్యామ్‌ నిర్మాణ సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లను వివరించారు. వీటిని అధిగమించడానికి తాము జరిపిన అధ్యయనాలను, డిజైన్‌ రూపకల్పనలో తీసుకున్న జాగ్రత్తలను వెల్లడించారు. 

భూకంపాలు తట్టుకునేలా...
తెహ్రీ డ్యామ్‌ నిర్మాణం తలపెట్టిన ప్రాంతం తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంత మని రాజీవ్‌ వైష్ణోయ్‌ తెలిపారు. తెహ్రీ డ్యామ్‌ వల్ల నీరు 42 కి.మీ. పొడవున జలాశయంలో 140 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందన్నారు. ఈ భారీ నీటి నిల్వ భూకంపాలకు కారణం అవుతుందని, డ్యామ్‌ కూలిపోతే దిగువన ఉన్న ఋషికేష్, హరిద్వార్‌ లాంటి పట్టణాలు నేలమట్టం అవుతాయని, దీన్ని కట్టకూడదని పర్యావరణవేత్తలు ఉద్యమాలు లేవనెత్తారని తెలిపారు. తెహ్రీ డ్యామ్‌పై విమర్శకులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతికి, రిక్టర్‌ స్కేల్‌పై 9, 10 స్థాయిలో భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా రాక్‌ఫిల్‌ డ్యామ్‌ డిజైన్‌ చేశామని చెప్పారు.

డ్యామ్‌ నిర్మాణం తర్వాత హిమాలయాల్లో భారీ భూకంపాలు సంభవించినా భూకంపాల ప్రభావాలను తట్టుకుని తెహ్రీ డ్యామ్‌ నిలిచిందని, ఆశించిన ఫలితాలను అందిస్తోందన్నారు. ఉత్తరాఖండ్‌ అవసరమైన వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ని సరఫరా చేస్తోందని వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైష్ణోయ్‌కి సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే జ్ఞాపికను బహూకరించి సత్కరించారు. సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు సీఈ రమేశ్, సీడీఓ సీఈ శ్రీనివాస్, ఎస్‌ఈ రాజశేఖర్‌రెడ్డి, పాలమూరు ఈఈ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top