
ఠాణాలో లొంగిపోయిన రమేశ్ రాథోడ్
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ గన్‌మన్‌పై దాడి కేసులో ఆదిలాబాద్ మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు రమేశ్ రాథోడ్ సోమవారం నాటకీయ పరిణామాల మధ్య ఖానాపూర్ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు.
* బెయిల్‌పై విడుదల
* పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా మారారని ఆరోపణ
ఖానాపూర్/నిర్మల్ అర్బన్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ గన్‌మన్‌పై దాడి కేసులో ఆదిలాబాద్ మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు రమేశ్ రాథోడ్ సోమవారం నాటకీయ పరిణామాల మధ్య ఖానాపూర్ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. ఈ నెల 9న గన్‌మన్‌పై దాడి కేసులో పోలీసులు ఆయనపై ఐపీసీ 353, 323 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8గంట లకు ఎస్సై అజయ్‌బాబు ఎదుట లొంగిపోగా భారీ భద్రత మధ్య నిర్మల్ కోర్టుకు రిమాండ్ చేశారు.
బెయిల్‌పై విడుదలైన అనంతరం నిర్మల్ నుంచి పార్టీ నాయకులతో భారీ కాన్వాయ్ మధ్య ఆయన ఖానాపూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక జగన్నాథ్‌చౌక్‌లో కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్‌తో స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లే క్రమం అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు నిలువరించారు. కొంతమందినే పోలీసుస్టేషన్‌కు అనుమతించారు. తాను గన్‌మన్‌పై పెట్టిన అట్రాసిటీ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలని సీఐ అంగోతు నరేశ్‌కుమార్, ఎస్సై అజయ్‌బాబును కోరారు.
దీంతో పోలీసులు తోసి వేశాడనే రశీదును ఇవ్వగా రమేశ్‌రాథోడ్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆ యన నిర్మల్, ఖానాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ అయిన తనకే న్యాయం జరగకపోతే సామాన్యులకు ఎలా జరుగుతుందని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా మారారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను మరిపిస్తోందని విమర్శించారు.
టీఆర్‌ఎస్ కావాలనే తనపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భయపడేది లేదని అన్నారు. అధికారులు, పోలీసులు టీఆర్‌ఎస్ ఏజెంట్లు, కార్యకర్తలు పనిచేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్, తూర్పు జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు, నాయకులు గండ్రత్ రమేష్, నాగరాజు, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.