‘రియల్‌’ రయ్‌.. రయ్‌..

Tax Benefit on Home Loan Interest Paid for Affordable Housing - Sakshi

కేంద్ర రాయితీతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపు

కలసి రానున్న పీఎంఏవై వడ్డీ రాయితీ

మొత్తం గరిష్టంగా దక్కే రాయితీ రూ. 6 లక్షలు

మధ్యతరగతి సొంతింటి కలకు ఊతం

పెట్రో రేట్ల పెంపుతో ఇసుక, సిమెంటు, స్టీలు ధరలపై భారం పడొచ్చని ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కేంద్రం ఇచ్చిన రాయితీలు రాష్ట్రంలో ఆ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా రాజధాని భాగ్యనగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 2020 వరకు రూ. 45 లక్షలలోపు గృహాల కొనుగోలుకు రుణాలు తీసుకునే వారికి వడ్డీ చెల్లింపులో అదనంగా రూ. లక్షన్నర మేరకు ఆదాయపు పన్ను రాయితీ లభించనుంది. ఫలితంగా గృహ రుణాలపై లభించే ఆదాయపు పన్ను రాయితీ రూ. 3.5 లక్షలకు చేరుకుంది. దేశంలో ప్రతి కుటుంబానికీ సొంతింటి కలను నెరవేరుస్తామని చెబుతున్న కేంద్రం... ప్రస్తుతం ఇచ్చిన రాయితీతో సొంతింటి కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి.

మరోవైపు తొలిసారిగా ఇళ్లు కొనుగోలు చేస్తున్న వారికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద గరిష్టంగా రూ. 2.67 లక్షల వడ్డీ రాయితీ రావడం గమనార్హం. దీంతో మొత్తం పన్ను రాయితీ రూ. 6 లక్షలకు చేరుకుంది. కేంద్రం ఇచ్చిన ఈ రాయితీలతో నిర్మాణరంగం మరింత ఊపందుకోనుంది. మరోవైపు భారీ గృహ సముదాయాలు నిర్మించేందుకు ముందుకు వచ్చే రియల్‌ సంస్థలకు భూములు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రియల్‌ కంపెనీలు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే మధ్యతరగతి వాళ్ల కలలను సాకారం చేయనుందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు చెబుతున్నారు.

పెట్రో ధరలతో ముడిసరుకుల భారం..
పెట్రోల్, డీజిల్‌లపై సెస్‌ విధించడంతో లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది నిర్మాణరంగంపైనా ప్రభావం చూపే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగానికి కీలకమైన ఇసుక, స్టీలు, సిమెంటు, కాంక్రీటు తదితర సరుకులపై రవాణా భారం పడే అవకాశాలు ఉండటంతో బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో మరింత జోరుగా..
దేశంలోని ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాదులోనే ధరలు తక్కువగా ఉండటం తెలిసిందే. దీంతో భాగ్యనగరంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా ఊపందుకుంటోంది. ప్రభుత్వం తాజాగా కల్పించిన ప్రోత్సాహకాలు, రాయితీలను భవిష్యత్తులో మరిన్ని కల్పిస్తే రియల్‌ రంగం వేగంగా ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ రెసిడెన్షియల్‌ విభాగంలో 30 శాతం వృద్ధి నమోదైందని ఇటీవల క్రెడాయ్‌ (ద కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా) ప్రతినిధులు వెల్లడించారు.

పెరిగిన ఇళ్ల రేట్లు
గృహ విక్రయాల్లో దేశంలోనే హైదరాబాద్‌ మొదటి స్థానం దక్కించుకుందని రియల్‌ ఎస్టేట్‌ సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. 2019 ప్రథమార్థంలో దేశవ్యాప్తంగా ఉన్న 7 నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగం పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్లాట్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ వేరే నగరాలను వెనక్కి నెట్టింది. జనవరి నుంచి జూన్‌ మధ్య దాదాపు 65 శాతం వృద్ధి నమోదు కాగా, జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్‌ నిలిచాయి. పశ్చిమ హైదరాబాద్‌లో నివాస సముదాయాలకు గిరాకీ ఎక్కువ ఉందని తెలిపింది.

స్వాగతిస్తున్నాం...
గృహ రుణాలపై లభించే ఆదాయపు పన్ను రాయితీ రూ. 3.5 లక్షలకు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. దీనికి పీఎంఏవై కింద లభిస్తున్న రూ. 2.67 లక్షల పన్ను రాయితీ కలిపితే గరిష్టంగా రూ. 6 లక్షల ప్రయోజనం చేకూరనుంది. సొంతింటి కలను నెరవేర్చాలనుకునే మధ్యతరగతి వర్గాలకు మంచి ప్రోత్సాహాన్నిస్తుంది. భారీ గృహ సముదాయాలు నిర్మించాలనుకునే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు భూ కేటాయింపులు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఆహ్వనిస్తున్నాం. అయితే పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల రవాణా చార్జీలు పెరిగి ఇసుక, స్టీలు, సిమెంటు, కాంక్రీటు వంటి వాటి ధరలు పెరుగుతాయన్న ఆందోళన కలిగిస్తోంది. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకురావడం వల్ల బిల్డర్లకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని కల్పిస్తుందని విశ్వసిస్తున్నాం. ఈసారి బడ్జెట్‌లో ఇవన్నీ నిర్మాణరంగానికి సానుకూల అంశాలే.     
               
– సి.శేఖర్‌రెడ్డి, మాజీ ప్రెసిడెంట్, క్రెడాయ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top