సింగరేణిలో 800 మెగావాట్ల ప్లాంట్‌

Super Critical Thermal Power Plant to come up at Singareni - Sakshi

సూపర్‌ క్రిటికల్‌ బాయిలర్‌ టెక్నాలజీతో నిర్మాణం

ప్రతిపాదనలను ఆమోదించిన సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నిర్మించనున్న 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జైపూర్‌లో సింగరేణి సంస్థ 1,200 మెగావాట్ల సబ్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించి విద్యుదుత్పత్తి జరుపుతోంది. అక్కడే 600 మెగావాట్ల సామర్థ్యంతో మరో సబ్‌ క్రిటికల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెండేళ్ల కిందట శంకుస్థాపన చేశారు.

అయితే సబ్‌ క్రిటికల్‌కు బదులు సూపర్‌ క్రిటికల్‌ బాయిలర్‌ టెక్నాలజీతో ప్లాంట్‌ నిర్మించాలని సింగరేణికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సూచించింది. కేంద్రం సూచన మేరకు 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి సింగరేణి ప్రతిపాదనలు పంపగా ఇటీవల సీఎం ఆమోదించారని సంస్థ వెల్లడించింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాగానే పనులు మొదలుపెట్టనున్నారు.

సెప్టెంబర్‌లో 93 శాతం విద్యుదుత్పత్తి
జైపూర్‌లోని 1,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ సెప్టెంబర్‌లో 93.84 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరిపిందని సంస్థ యాజమాన్యం తెలిపింది. 810.76 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవగా.. 762.92 మిలియన్‌ యూనిట్లను గజ్వేల్‌లోని పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేశామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు 4,613 ఎంయూల విద్యుదుత్పత్తి జరిపి 4325.48 ఎంయూలను రాష్ట్ర అవసరాలకు సరఫరా చేసినట్లు వెల్లడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 87.53 శాతం సామర్థ్యంతో విద్యుదుత్పత్తి జరిపినట్లు సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top