భానుడి భగభగ

Summer Temperature Rises in Adilabad - Sakshi

జిల్లాలో 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

ఉక్కపోతతో ప్రజలు సతమతం

పెరిగిన కూలర్లు, ఏసీల వినియోగం

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా జనాలు ఇంట్లో ఉన్నప్పటికీ ఉక్కపోతతో సతమతం అవుతున్నారు. ఇంట్లో ఉంటూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కూలర్లు, ఏసీలకు అతుక్కుపోయారు. గతేడాది కంటే ఈసారి ఎండలు దంచికొడుతున్నాయి. సోమవారం జిల్లాలో 40 డిగ్రీల గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ పలు గ్రామాల్లో రైతులు పంట పొలాల్లో పనులను చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఉపాధిహామీ పనులు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు ఎండకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అకాల వర్షాలు.. మండుతున్న ఎండలు
గతేడాది కంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఓవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంటుండడంతో చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం, సాయంత్రం చిరుజల్లులతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో పూరి గుడిసెల్లో ఉండేవారు, ఇటుక బట్టీల వద్ద పనిచేసేవారు అవస్థలు పడుతున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో వారికి ఎండ తీవ్రత కనిపించడం లేదు. ఉక్కపోత భరించలేక కూలర్లు, ఏసీలు అధికంగా వినియోగిస్తున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సమయాల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బారికేడ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. గతనెలలో కురిసిన అకాల వర్షం కారణంగా పలు మండలాల్లో మొక్కజొన్న, జొన్న, శనగ పంటలతో పాటు కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్ట పోతున్నారు.

జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుతం ఎండ అధికమవుతున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. లాక్‌డౌన్‌ దృష్ట్యా ఇండ్లకే పరిమితం కావాలి. అత్యవసరమైతే ఎండ నుంచి రక్షణ పొందేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దు.– డాక్టర్‌ రమ, ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top