కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎండదెబ్బ | Summer Effect to Kaleshwaram Project Works | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎండదెబ్బ

Apr 30 2018 2:16 AM | Updated on Nov 9 2018 5:56 PM

Summer Effect to Kaleshwaram Project Works - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు మండుతున్న ఎండలు ప్రతిబంధకంగా మారాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌజ్‌ల పనులు జరుగుతున్న జయశంకర్‌ భూపాలపల్లి, రామగుండం, పెద్దపల్లి జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కార్మికులు విలవిల్లాడుతున్నారు. గోదావరి ఇసుక దిబ్బల మీదుగా వీస్తున్న వేడి గాలులు పనులను ముందుకు కదలనీయడం లేదు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిన ప్రాజెక్టు అధికారులు.. పగటిపూట పనులను తగ్గించి రాత్రి పూట పని సమయాలను పెంచారు. 

30 వేల మందికిపైగా ఉక్కిరిబిక్కిరి 
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జూలై, ఆగస్టు నాటికి గోదావరి నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం ప్రణాళిక వేసింది. గోదావరికి వరదలు పెరిగే సమయానికి ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌజ్‌లను సిద్ధం చేయాలని నిర్ణయించింది. పనులు జరుగుతున్న ఆరుచోట్ల సుమారు 30 వేల మందికిపైగా కార్మికులు, ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. పనులన్నీ
ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చాయి. బ్యారేజీల పరిధిలో కోటికి క్యూబిక్‌ మీటర్లకుపైగా మట్టి పని ఉండగా.. ఇప్పటికే 72 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. సుమారుగా 40 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకుగాను.. 21 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పూర్తయింది. 

బ్యారేజీల పరిధిలో గేట్ల బిగింపు ప్రక్రియ సైతం మొదలైంది. అయితే గడువు ముంచుకొస్తుండటంతో పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏజెన్సీలు యంత్ర పరికరాలను సమకూర్చుకున్నా.. షట్టరింగ్, సెంట్రింగ్, గేట్ల బిగింపు, స్టీలు నిర్మాణాలు(రీయిన్‌ఫోర్స్‌మెంట్‌) పనులకు కార్మికుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్టీలు మెటీరియల్‌ను నిర్మాణ ప్రాంతానికి తరలించడం, డిజైన్‌కు అనుగుణంగా బిగించడం కీలకం. కానీ స్టీలు ఎండలతో వేడెక్కి, ముట్టుకుంటే కాలుతుండటంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టీలు నిర్మాణాలు చేయనిదే కాంక్రీట్‌ పనులు చేయడానికి అవకాశం లేదు. దాంతో కాంక్రీట్‌ పనులు నెమ్మదించాయి. ఐదారు రోజుల కింది వరకు జరిగిన పనుల్లో ఇప్పుడు సగమే జరుగుతున్నాయి. వారం కింద మేడిగడ్డ పరిధిలో రోజుకు 7 వేల క్యూబిక్‌ మీటర్ల మేర పనులు జరగ్గా.. శనివారం అధికారిక లెక్కల ప్రకారం 4,213 క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే జరిగింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌజ్‌ల పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 

రాత్రి పూట పనులు 
ఎండల తీవ్రత మరో నెల రోజుల పాటు కొనసాగే అవకాశమున్న ఉన్న నేపథ్యంలో పనులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పగటి పూట 70 శాతం జరుగుతున్న పనులను 30శాతానికి తగ్గించి.. రాత్రిపూట 70శాతం పనులు చేయిస్తున్నారు. కార్మికులకు రోజూ మూడుసార్లు మజ్జిగ, మూడు సార్లు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందిస్తున్నారు. ఇక ఎండల వేడి తట్టుకోలేక కొందరు. పశ్చిమబెంగాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో మరికొందరు కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళుతున్నారు. దీంతో కార్మికుల కొరత ఏర్పడి పనుల్లో వేగం తగ్గుతోంది.  

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement