అడవిలో వనమేధం

Stripping trees in 329 hectares - Sakshi

     329 హెక్టార్లలో చెట్ల నరికివేత 

     రిజర్వాయర్‌ పనుల పేరిట గొడ్డలి వేటు 

     అటవీ శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం 

కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట, నిజామాబాద్‌ గ్రామాల్లోని అటవీప్రాంతం అక్రమార్కుల గొడ్డలి వేటుకు బలవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల ధనార్జన, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంతో వేలాది వృక్షాలు నేలమట్టమవుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్యాకేజీ –9 పనులు చేపట్టిన ఈ ప్రాంతంలో అటవీశాఖ నుంచి గానీ, సంబంధిత శాఖల నుంచి గానీ అనుమతి పొందకుండానే చెట్లు నరికివేస్తున్నారు. కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మట్టి తవ్వకాలూ జోరుగా సాగిస్తున్నారు. దీనిపై ఓ గ్రామస్తులు హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. 

329 హెక్టార్ల అటవీ ప్రాంతం.. 
మల్కపేట, నిజామాబాద్‌ గ్రామాల అటవీ ప్రాంతంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–9 పనులు జరుగుతున్నాయి. ఎత్తిపోతల పథకంలో భాగంగా 3 టీఎంసీల నీటి నిల్వ కోసం రిజర్వాయర్, సొరంగం, లైనింగ్, కట్ట పనులు కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణంలో పట్టా భూములతోపాటు సుమారు 329 హెక్టార్ల అటవీ ప్రాంతం కూడా ముంపునకు గురవుతోంది. 

అనుమతి లేకుండానే పనులు.. 
మల్కపేట, నిజామాబాద్‌ శివారు అటవీ ప్రాంతం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతోంది. ఇందులోని టేకు, వేప, నరెంగ, బిటుకు తదితర రకాల వృక్షాలను నరికి వేశారు. కొన్నిప్రాంతాల్లోని అటవీ ప్రాంతా న్ని వ్యాపారులు అధికారులకు కొంత ముట్టజెప్పి చెట్లు నరికి కలప తీసుకెళ్లారు. ఈ ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా అనుమతి తీసుకోకుండానే మట్టితవ్వకాలు చేపట్టారు.

అటవీ ప్రాంతాన్ని నరికి వేయించిన అధికారులు.. అందులో 15,204.371 సీఎంటీల కలప, 23,298 టన్నుల పొరక లభించినట్లు తేల్చారు. కానీ, అంతకు రెండు, మూడింతల కలపను విక్రయించేశారని ప్రచారం జరిగింది. ప్రాజెక్ట్‌ పనుల్లో అనుమతి లేకుండా లక్షలాది చెట్లను నరికేసి, ఒక్క మొక్క కూడా నాటలేదంటూ మండలంలోని నిజామాబాద్‌ గ్రామానికి చెందిన దుర్గం మహేశ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. అంతకుముందు జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించలేదు.  

నరికిన చెట్లు ఎన్ని..? నాటిన మొక్కలెన్ని..? 
ప్రజాప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా అనుమతులు లేకుండా చెట్లను ఎలా కొట్టివేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒక చెట్టును నరికివేయాలంటే ప్రత్యామ్నాయంగా రెండు మొక్క లు నాటితే గానీ అనుమతులివ్వరని, అలాంటిది అనుమతి తీసుకోకుండానే, ఒక్కమొక్కను నాటకుండానే వందలాది హెక్టార్లలో చెట్లను ఎలా తొలగించారో సమాధానమివ్వాలని కోరింది. చెట్ల నరికివేతతోపాటు నాటిన మొక్కల గురించి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top