నేటి నుంచి విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మె

Strike of electricity contract employees from today - Sakshi

     యాజమాన్యం, ఉద్యోగుల మధ్య చర్చలు విఫలం

     16 డిమాండ్లలో ఏ ఒక్కటినీ అంగీకరించని ట్రాన్స్‌కో

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖలో సమ్మె సైరన్‌ మోగింది. డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌(ఆర్టిజన్లు) కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. విద్యుత్‌ శాఖలో తమను విలీనం చేసుకోవాలనే ప్రధానమైన డిమాండ్‌తో పాటు 16 రకాల డిమాండ్లపై తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గత నెలలో సమ్మె నోటీస్‌ ఇచ్చింది. శుక్రవారం ఈ డిమాండ్లపై యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్‌ గౌడ్, సాయిలుతో కార్మిక శాఖ అధికారులు చర్చలు జరిపారు. కార్మిక శాఖ సంయుక్త కార్యదర్శి గంగాధర్‌ సమక్షంలో జరిగిన చర్చలకు ట్రాన్స్‌కో సంయుక్త కార్యదర్శి శోభరాణి , ఎస్పీడీసీఎల్‌ ప్రతినిధి లోక్యానాయక్‌లు హాజరయ్యారు.  డిమాండ్లు పరిష్కరించలేం... 

కోర్టులో ఈ వివాదం ఉన్నందున డిమాండ్లను ఆమోదించడం కోర్డు ధిక్కారమే అవుతుందని, న్యాయ వివాదం తేలేదాకా డిమాండ్లను పరిష్కరించలేమని డిస్కమ్‌ల ప్రతినిధులు స్పష్టం చేశారు. డిమాండ్లేవీ పరిష్కారం కాకపోవడంతో శనివారం నుంచి ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌లలోని 18 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్తారని, సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని  తేల్చి చెప్పారు. పారిశ్రామిక వివాదాల చట్టం–1947 ప్రకారం ఆర్టిజన్లకు సమ్మె చేసే అధికారం లేదని చేప్పే అధికారులు, ఆ చట్టంలోని ఎస్మా ఏ విధంగా అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.  

సమ్మె చట్ట విరుద్ధం:ట్రాన్స్‌కో జేఎండీ  
జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్‌లో ఆర్నెల్ల పాటు సమ్మెపై నిషేధం ఉందని, కార్మికులు సమ్మెలో పాల్గొంటే ఎస్మా అమలు చేస్తామని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు హెచ్చరించారు.

18 వేల మంది సమ్మెలోకి...
డిస్కమ్‌లలో 23 వేల మంది ఉండగా, 18 వేల మంది సమ్మెలోకి వస్తున్నారని, సబ్‌స్టేషన్‌లలో విధులు, కరెంట్‌ స్తంభాలు, ఎమర్జెన్సీ సర్వీసులకు దూరంగా ఉంటా మన్నామని అధ్యక్షడు శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు. డిమాండ్లను పరిష్కరించే దాకా సమ్మె కొనసాగుతుందన్నారు. కార్మికులను శాంతింపచేయడానికి శనివారం రాత్రి ఎస్పీడీసీఎల్‌ సీంఎడీ రఘుమారెడ్డి రంగంలోకి దిగారు. డిమాండ్లు పరిష్కరించలేని అనివార్య స్థితిలో ఉన్నామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. డిస్కమ్‌లో గ్రేడ్‌–4 ఆర్టిజన్లు సాంకేతిక విధులు నిర్వహిస్తుంటే వారి విదార్హతల ఆధారంగా ప్రత్యేక అలవెన్సు వర్తింపచేస్తామని హామీ ఇవ్వగా.. విలీనంపై స్పష్టత ఇచ్చేదాకా  సమ్మె కొనసాగుతుందని కార్మికులు తేల్చి చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top