
కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రూ.343 కోట్లతో విద్యుత్ లైన్ల మార్పు
రూ.100 కోట్లకు మించని పనులను రెండింతలు పెంచిన వైనం
ఈ పనులు ఏమాత్రం అవసరం లేదంటున్న నిపుణులు
ఓ ఉన్నతాధికారికి లబ్ధి చేకూర్చే యత్నం.. సర్కారు పెద్దలకూ కమీషన్లు
ఇందుకోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు
రూ.30 వేల కోట్ల అప్పులు చేసిన ఏపీఎస్పీడీసీఎల్‌కు ఇది అదనపు భారం
సాక్షి, అమరావతి: విద్యుత్ శాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. అవసరమైన పనుల కాంట్రాక్టులను అయిన వారికి ఇచ్చి కమీషన్లు దండుకునే స్థాయి నుంచి కమిషన్ల కోసమే అవసరమే లేని పనులు చేసే స్థాయికి దోపిడీ చేరింది. ఇప్పటికే డైరెక్టర్ల నియామకం, ఉద్యోగుల బదిలీల్లో భారీగా దండుకున్న కూటమి నేతలు తమ కమీషన్లతో పాటు విద్యుత్ శాఖలో ఓ అధికారిని ‘సంతోష’పెట్టడానికి అక్కర్లేని పనులకు తెరతీశారు. పదవీ కాలం ముగిసినా, మరి కొన్నాళ్లు అదే పదవిలో కొనసాగడానికి ఓ ఉన్నతాధికారికి కూటమి ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. అందుకు ప్రతిఫలంగా పరస్పరం లబ్ధి పొందేందుకు ఇలాంటి వృధా పనులకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రూ.342.96 కోట్ల వ్యయంతో 33 కేవీ విద్యుత్ లైన్ల పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. టెండర్ దరఖాస్తు దాఖలుకు శుక్రవారంతో గడువు ముగిసింది. ఈ నెల 20న టెండర్లు తెరవనున్నారు. అయితే ఈ టెండర్ల వెనుక భారీ కుంభకోణానికి కూటమి ప్రభుత్వం, ఏపీఎస్పీడీసీఎల్‌లోని ఉన్నతాధికారితో కలిసి తెరతీసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కడప డివిజన్‌లో 28 కిలోమీటర్లు, రాయచోటి డివిజన్‌లో 25 కిలోమీటర్లు, ప్రొద్దుటూరు డివిజన్‌లో 52.5 కిలోమీటర్లు చొప్పున మొత్తం 105.5 కిలోమీటర్లు 9 టవర్లతో కలిపి 157 చదరపు మీటర్ల మేర అల్యూమినియం కండక్టర్‌తో 33 కేవీ లైన్‌ను బలోపేతం చేయడం ఈ పని ఉద్దేశం. ఈ రకమైన ప్రాజెక్టులను 2019–24 మధ్య అనంతపురం, ప్రొద్దుటూరు, కడపలలో మెస్సర్స్ సన్ షైన్ ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ద్వారా కేవలం రూ.100 కోట్లతోనే పూర్తి చేశారు.
అలాంటిది ఏపీఎస్పీడీసీఎల్ ఇప్పుడు రూ.342.96 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) నుంచి రుణంగా తీసుకుని మరీ చేస్తామంటోంది. ఈ భారం అంతిమంగా రాష్ట్ర ప్రజలపైనే విద్యుత్ బిల్లుల రూపంలో పడుతుంది. ఇప్పటికే రూ.30 వేల కోట్ల అప్పులు చేసిన ఏపీఎస్పీడీఎల్‌కు ఇది అదనపు భారం కానుంది.
అసలు ఆ అవసరమే లేదు..
ప్రస్తుతం ఉన్న లైన్ల స్థానంలోనే కొత్త లైన్లు వేయనున్నట్లు డిస్కం ప్రతిపాదనలో స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ లైన్లలో కొత్తవి వేయాల్సిన అవసరమే ప్రస్తుతం లేదని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత విద్యుత్ లోడ్‌లను తీర్చడానికి తగినంత సామర్ధ్యం గల 33 కేవీ లైన్‌లు ఇప్పటికే ప్రతిపాదిత ప్రాంతాల్లో ఉన్నాయని చెబుతున్నారు. పైగా ప్రస్తుత ఫీడర్లే తక్కువ లోడ్‌లో నడుస్తున్నాయని, మరింత డిమాండ్ పెరిగినా కూడా అవి ఆ లోడ్‌ను తట్టుకోగలవని స్పష్టం చేస్తున్నారు.
ఇదే అంచనా వ్యయంతో గతంలో ఇదే డిస్కం టెండర్లు పిలవగా గత ప్రభుత్వం ఆ టెండర్‌ను రద్దు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అంచనా వ్యయం కూడా లేకుండా నేరుగా టెండర్లు పిలిచేశారు. ఏపీఎస్పీడీసీఎల్‌కు చెందిన ఓ ఉన్నతాధికారికి చెందిన సంస్థకు లబ్ధి చేకూర్చడం కోసం, తద్వారా కొందరు నేతలకు కమిషన్లు దక్కడం కోసం ఈ అనవసర వృధా టెండర్లు పిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ రూ.343 కోట్లను పట్టణాల్లో అవసరమైన చోట 33/11కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి, ఇప్పటికే ఓవర్ లోడ్‌ను మోస్తున్న 11 కేవీ ఫీడర్లను విభజించడానికి ఖర్చు చేసి ఉంటే కనీసం విద్యుత్ కోతలైనా తప్పి నాణ్యమైన విద్యుత్ అందడానికి అవకాశం ఉండేదని నిపుణులు చెబుతున్నారు.
ఏపీఎస్పీడీసీఎల్ ప్రతిపాదించిన పనులు
» 3,957 ఎం 6 టైపు టవర్లు. ఒక్కోదానికి రూ.4.5 లక్షల చొప్పున మొత్తం రూ.177.5 కోట్లు
» 1,460 ఎం 9 టవర్లు. ఒక్కోదానికి రూ.5.06 లక్షల చొప్పున మొత్తం రూ.74 కోట్లు
» 12.5 మీటర్ల స్పన్ స్తంభాలు 119. ఒక్కోదానికి రూ.26 వేలు చొప్పున మొత్తం రూ.32 లక్షలు
» 11 మీటర్ల స్పన్ స్తంభాలు 1782. ఒక్కోదానికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.2.7 కోట్లు
» 295.71 కిలోమీటర్ల మేర 100 చదరపు మిల్లీ మీటర్ల ఏఏఏ కండక్టర్. కిలోమీటర్‌కు ఖర్చు రూ.88 వేల చొప్పున మొత్తం రూ.2.61 కోట్లు
» 1,475 కిలోమీటర్ల మేర 157 చదరపు మిల్లీ మీటర్ల ఏఏఏ కండక్టర్. కిలోమీటర్‌కు ఖర్చు రూ.1.42 లక్షల చొప్పున మొత్తం రూ.21 కోట్లు.
» ఇంటర్ లింకింగ్ లైన్లను టవర్లు లేకుండా తక్కువ ఖర్చుతో పీఎస్‌సీసీ పోల్స్‌తోనే ఏర్పాటు చేయొచ్చని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.