వీధి వీధి వి'చిత్రం'

street art festival in hyderabad - Sakshi

నగర వీధులు ‘చిత్ర’మైన అందాల్ని సంతరించుకుంటున్నాయి. మెట్రో నగరాల్లో విజయవంతమైన స్ట్రీట్‌ ఆర్ట్‌ కాన్సెప్ట్‌ నగరవాసుల్ని ఇప్పుడిప్పుడే ఆకట్టుకుంటోంది. గతేడాది సిటీలో నిర్వహించిన స్ట్రీట్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌ ఈ ట్రెండ్‌కు ఆజ్యం పోసింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా పీపుల్స్‌ ప్లాజా ఎదురుగా ఉన్న స్లమ్‌ ఏరియా ఎంఎస్‌ మక్తాకు సైతం సరికొత్త లుక్‌ను అందించిన నేపథ్యంలో నగరంలో తొలి ఓపెన్‌ ఆర్ట్‌ గ్యాలరీగా స్ట్రీట్‌ ఆర్టిస్టులు దీనిని ఎంచుకోనున్నారు. నవంబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ ఫెస్ట్‌.. ఈ సారి మరిన్ని చిత్ర విచిత్రాలను సిటీకి తేవడంతో నగరవాసుల్లో మరింత క్రేజ్‌ను పెంచనుంది.   

సాక్షి, సిటీబ్యూరో: భవనం పాతబడింది. దాని రంగులు మాత్రమే కాదు.. ఎలివేషన్‌ సైతం ఆకట్టుకోవడం లేదు. ఏం చేయాలి? రూ.లక్షలు ఖర్చు పెట్టి రీకన్‌స్ట్రక్ట్‌ చేయించడం తప్ప మరో మార్గం లేదా? గ్రౌండ్‌ బావుంది.. కానీ కాంపౌండ్‌ వాల్‌ మరీ ఫ్లాట్‌గా ఖాళీగా అనిపిస్తోంది. దీన్ని కాస్త ఆకర్షణీయంగా తీర్చిదిద్దలేమా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు స్ట్రీట్‌ ఆర్ట్‌ రూపంలో సమాధానాలు లభిస్తున్నాయి.  

ఆర్టిస్టులు తక్కువే...  
నగరంలో స్ట్రీట్‌ ఆర్ట్‌ అంటే చిత్రకారులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఎందుకంటే ఇది కాస్త వేగంగా చేయాల్సిన హార్డ్‌ వర్క్‌. ఎంత త్వరగా వర్క్‌ పూర్తి చేస్తారనేదే ఇందులో ముఖ్యమైన అంశం. చిత్రాన్ని బట్టి కనీసం వారం నుంచి 15 రోజులు వెచ్చించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్ట్రీట్‌ ఆర్ట్‌లో రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ ఎక్కువ. ఆదాయం పరంగానూ గ్యాలరీ సేల్స్‌తో సమానంగా రావు. పైగా గ్యాలరీ ప్రదర్శనలతో పోలిస్తే స్ట్రీట్‌ ఆర్ట్‌కు దక్కే గౌరవం తక్కువేననే ఆలోచనతో సిటీలో వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో కూడా స్ట్రీట్‌ ఆర్టిస్టులు లేరు.  

ఆదరణకు ఆజ్యం...
ఇన్ని సమస్యల మధ్య గతేడాది తొలిసారి నగరంలో నిర్వహించిన స్ట్రీట్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌ అనూహ్యంగా విజయవంతమైంది. ఇందులో దేశవిదేశీ ఆర్టిస్టులు పాల్గొన్నారు. వీరు ఎంఎస్‌ మక్తాను వేదికగా ఎంచుకున్నారు. ఒక్కో చిత్రకారుడికి ఒక్కో బిల్డింగ్‌ కాన్వాస్‌గా మారింది. తెలంగాణ కళాకారులకూ ఇందులో భాగస్వామ్యం కల్పించారు. దీన్ని స్టార్ట్‌ ఇండియా ఫౌండేషన్, కళాకృతి, ఆర్ట్‌ ఎట్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. అక్కడి 8 భవనాలను ఆర్టిస్టులు అందంగా తీర్చిదిద్దన తీరు నగరవాసులను ఆలోచనా ధోరణుల్ని అమాంతం మార్చేసింది.  
 
మెట్రోల్లో హిట్‌...  
విదేశాల్లో చాలా పాపులరైన స్ట్రీట్‌ ఆర్ట్‌కు మన దేశంలోని మెట్రోల్లోనూ మంచి క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో అద్భుతమైన ఆదరణకు నోచుకుంటోంది. ముంబై, బెంగుళూర్‌లోనూ ఫాలోయింగ్‌ బాగుంది. ఇప్పుడిప్పుడే సిటీకి చేరువవుతోంది. ఒకప్పుడు వాల్‌ మీద ఆర్ట్‌ అంటే.. దానిని పాడు చేయడమనే ఆలోచన కొందరిలో ఉండేది. అయితే వాల్‌ని అందంగా తీర్చిదిద్దడానికి స్ట్రీట్‌ ఆర్ట్‌ మంచి మార్గమని ఇప్పుడు అర్థమైంది.  
 
మక్తా.. ఓపెన్‌ ఆర్ట్‌ గ్యాలరీ  
నగరంలోని స్లమ్‌ ఏరియాల్లో ఒకటిగా పేరొందింది ఎంఎస్‌ మక్తా. గతేడాది నిర్వహించిన స్ట్రీట్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌ మక్తా పరిసరాలకు కొత్త అందాలను తీసుకొచ్చింది. దీంతో మక్తా ప్రాంతాన్ని నగరంలోనే స్ట్రీట్‌ ఆర్ట్‌కి వేదికగా, సిటీలో తొలి ఓపెన్‌ ఆర్ట్‌ గ్యాలరీగా మార్చాలని నగరానికి చెందిన స్ట్రీట్‌ ఆర్టిస్టులు ఆలోచిస్తున్నారు.  

అవగాహన పెరగాలి...  
దాదాపు 8 ఏళ్లుగా సిటీలో స్ట్రీట్‌ ఆర్టిస్టులుగా ఉన్నాం. ఈ కళపై ఇప్పుడున్నంత అవగాహన ఇంతవరకు లేదు. నగరంలోని పలు ప్రాంతాల్లో మేం విభిన్న అంశాలపై సందేశాత్మకంగా స్పాంటేనియస్‌గా చిత్రాలు గీస్తున్నాం. చాలా వ్యయప్రయాసలకు ఓర్చుకొని మా ప్యాషన్‌ను కొనసాగిస్తున్నాం. స్ట్రీట్‌ ఆర్ట్‌కు ఇప్పుడిప్పుడే మంచి రోజులొస్తున్నాయి. సిటీలోని భవన యజమానులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. అయితే ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. అప్పుడు నగర వీధులు మరింత కళాత్మకంగా, సుందరంగా తయారవడం తథ్యం.  
స్వాతి, విజయ్‌ (ఆర్టిస్ట్‌ కపుల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top