నిలోఫర్‌లో సేవలు నిల్‌

Staff Shortage in hyderabad Niloufer Hospital - Sakshi

నిలోఫర్‌ ఆసుపత్రిలో రోగులు ఎక్కువ.. సేవలు తక్కువ..  

మంచాలపై బెడ్‌షీట్లు కూడా లేని వైనం

నాంపల్లి: ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’  అన్న చందంగా మారింది నిలోఫర్‌ ఆసుపత్రి పరిస్థితి. రోగుల రద్దీకి తగ్గట్లుగా సేవలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యవసర విభాగంతో పాటు వార్డుల్లోనూ మంచాలు దొరకడం లేదు. దీంతో ఒకే పడకపై ఇద్దరు చిన్నారులకు వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం మంచాలపై బెడ్‌షీట్లు కూడా లేకపోవడంతో రోగుల ఇక్కట్లు మరింత రెట్టింపయ్యాయి.

ఆరునెలలుగా బెడ్‌ షీట్లు బంద్‌..
ఆసుపత్రిలో దాదాపు 1100 పడకలు ఉన్నాయి. అయితే ఈ మంచాలపై వేసే బెడ్‌షీట్ల కొరత అధికంగా ఉంది. ప్రతిరోజూ పడకపై బెడ్‌షీట్లను మార్చాల్సి ఉండగా.. కానీ ఆసుపత్రిలో గత ఆరు నెలలుగా పడకలపై బెడ్‌షీట్లను వేయకుండానే మానేశారు. దీంతో రోగులు తమ వెంట తెచ్చుకున్న బెడ్‌ షీట్లనే వాడుకుంటున్నారు.

మెషిన్లకు మరమ్మతులు జరిగేనా..?  
నిలోఫర్‌లో ఒకప్పుడు దోభీలతో బెడ్‌షీట్లను ఉతికించి రోగులకు సేవలందించే పడకలపై ప్రతి రోజూ మార్చేవారు. దోభీల స్థానంలో వాషింగ్‌ మెషిన్లు వచ్చేశాయి. ఈ మెషిన్ల కొనుగోలుకు లక్షలాది రూపాయలు వెచ్చించారు. ప్రస్తుతం ఈ మెషిన్లు రిపేర్‌ కావడంతో సిబ్బంది బెడ్‌షీట్లను ఉతకడం మానేశారు. దీంతో వారం, పది రోజుల పాటు చికిత్సలకు వచ్చే రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఒక రోగి స్థానంలో మరో రోగి అలానే పడకలను కేటాయిస్తుండడంతో ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించి రోగుల పడకలపై బెడ్‌షీట్లను మార్చాలని రోగి సహాయకులు కోరుతున్నారు.

కొత్త పన్నాగం..
పాడైన వాషింగ్‌ మెషిన్లకు మరమ్మతులు చేయించాల్సిన అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని రోగుల సహాయకులు మండిపడుతున్నారు. వీటి స్థానంలో కొత్త మెషిన్లను కొనుగోలు చేసేందుకు అధికారులు కొత్త పన్నాగం ఎత్తుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  కొత్తవాటితో కొంత కమీషన్‌ వస్తుందనే ఆశతో ఉన్న వాటిని రిపేర్‌ చేయించకుండా ఉంటున్నట్లు సర్వత్రా∙విమర్శలు వస్తున్నాయి. కొత్త మెషిన్లు మార్చాలంటూ ప్రభుత్వానికి లేఖలు కూడా రాసినట్లు తెలిసింది. ఈ కొత్త మెషిన్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందో లేక పాత మెషిన్లకే మరమ్మతులు చేస్తారో వేచిచూడాల్సిందే. కాగా.. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ మురళికృష్ణను ఫోన్‌లో వివరణ కోరే ప్రయత్నం చేయగా స్పందించలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top