శ్రీశైలం నుంచే ‘పాలమూరు’ నీరు! | Srisailam from the 'palamuru' Water! | Sakshi
Sakshi News home page

శ్రీశైలం నుంచే ‘పాలమూరు’ నీరు!

May 22 2015 2:51 AM | Updated on Mar 22 2019 2:59 PM

శ్రీశైలం నుంచే ‘పాలమూరు’ నీరు! - Sakshi

శ్రీశైలం నుంచే ‘పాలమూరు’ నీరు!

శ్రీశైలం ప్రాజెక్టు నుంచే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
మంత్రులు, అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లతో సుదీర్ఘ సమీక్ష
బ్రజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన కేటాయింపుల్లోంచే 70 టీఎంసీల నీరు తీసుకునేలా ప్రణాళిక   
31న శంకుస్థాపన  
అదేరోజు నక్కలగండికి శిలాఫలకం!

సాక్షి, హైదరాబాద్:  శ్రీశైలం ప్రాజెక్టు నుంచే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని మళ్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

ముందుగా నిర్ణయించిన జూరాలపై ఇప్పటికే నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా మంటి ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉండడం, జూరాల రిజర్వాయర్ సామర్ధ్యం చిన్నది కావడంతో... పెద్ద రిజర్వాయర్‌గా ఉన్న శ్రీశైలం నుంచి నీటిని తీసుకుంటేనే మేలనే అభిప్రాయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్లు తెలిసింది. అంతేకాక... జూరాలకు 25 రోజులు మాత్రమే వరద ఉంటుండగా, శ్రీశైలంలో 90 రోజులపాటు ఉండడం కూడా అక్కడి నుంచే నీటిని మళ్లించేందుకు మొగ్గుచూపారు.

నీటిని మళ్లింపు విషయంలో స్పష్టత రావడంతో ఈ నెల 31న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించారు. గురువారం పాలమూరు ఎత్తిపోతలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు తదితరాలపై నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, రిటైర్డు ఇంజనీర్లు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు.

ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సమీక్షలో... బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కృష్ణాలో వినియోగించుకునేందుకు హక్కు ఉన్న నీటిలో నుంచే ప్రాజెక్టుకు అవసరమైన 70టీఎంసీలను వాడుకొని పది లక్షల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. శ్రీశైలం నుంచి నీటిని మళ్లిస్తే మొదటి ప్రతిపాదనలో ఉన్న కోయిల్‌కొండ, గండేడు రిజర్వాయర్లు ఉండవు. అయితే వాటి కింద ఉన్న ఆయకట్టు దెబ్బతినకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు.

కొత్త ప్లాన్‌లో లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌తో పాటు మరో నాలుగు రిజర్వాయర్లు చేపట్టాల్సి ఉంటుంది. కొత్త కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణం అంచనాలను ఈనెల 25లోగా తమకు అందజేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. వాటి పరిశీలన అనంతరం 31న ప్రాజెక్టుకు భూత్పూర్ వద్ద శంకుస్థాపన చేయనున్నారు.
 
జీవో 13కు ఓకే!
రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్)పెంపు చేయాలన్న నలుగురు సభ్యుల కమిటీ నివేదికకు ముఖ్యమంత్రి ఆమోదం ఇచ్చినట్లు తెలిసింది.  జీవో-13ని చిన్నపాటి మార్పులుచేర్పులతో అమలు చే సి, పనులు వేగిరం అయ్యేల ఆచూడాలని సూచించినట్లు సమాచారం. ఈ జీవో అమలైతే సుమారు రూ.4వేల కోట్లఅదనపు భారం పడనుందని సమాచారం.
 
31నే నక్కలగండి...
నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మూడన్నర లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, ఫ్లోరైడ్ గ్రామాల దాహార్తిని తీర్చేందుకు ఉద్దేశించిన నక్కలగండి ఎత్తిపోతల పథకాన్ని పాలమూరుతో పాటు ఈ నెలాఖరునే శిలాఫలకం వేసేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. 7.64 టీఎంసీల సామర్ధ్యం ఉండే నక్కలగండి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి మిడ్‌డిండి ద్వారా  అప్పర్ డిండి వరకు నీటి తరలించేందుకు మొత్తంగా రూ.5,500 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement