రామయ్యా అదిగోనయ్యా.. రమణీ లలామ..నవలావణ్య సీమ ..

Sri Seetharama Kalyanam Done As Grand Level At Bhadradri - Sakshi

వైభవోపేతంగా సీతారామ కల్యాణం.. పులకించిన భద్రాద్రి 

సాక్షి, కొత్తగూడెం:  దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఆదివారం శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీరామ.. జయరామ... జయజయ రామ.. నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. అర్చకస్వాముల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మిథిలా స్టేడియంలో నయనానందకరంగా సాగిన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింది. సీతారాములు ఆశీనులైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. అర్చకులు తెల్లవారుజామున 2 గంటలకే దేవాలయం తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు.

అనంతరం తిరువారాధన, నివేదన, శాత్తుమురై, మూలవరులకు అభిషేకం, మంగళా శాసనం జరిపించారు. తర్వాత గర్భగుడిలోని మూలమూర్తులకు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో ఆశీనులను చేసి మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తోడ్కొని వచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపించారు. సీతారాముల కల్యాణోత్సవ విశిష్టతను, భద్రాద్రి ఆలయ క్షేత్ర ప్రాశస్త్యాన్ని, భక్త రామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల ప్రాశస్త్యాన్ని వేద పండితులు భక్తులకు వివరించారు. సీతమ్మవారికి ఎక్కడైనా మంగళసూత్రాలు రెండే ఉంటాయని, కానీ భద్రాచలంలో మాత్రం మూడు సూత్రాలు ఉంటాయని, రామదాసు చేయించిన సూత్రం ఇక్కడ అదనంగా ఉంటుందని తెలిపారు. 

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి 
సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఈసీ అనుమతితో స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. కాగా, సోమవారం మిథిలా స్టేడియం ప్రాంగణంలో స్వామి కల్యాణోత్సవం జరిగిన మండపంలోనే శ్రీరామ మహా పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు  జరగనుంది.  ప్రభుత్వం తరఫు న గవర్నర్‌ నరసింహన్‌ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top