హిందూ రాజ్యం కోసమే

Spokesman comments at Virasam Meeting - Sakshi

కేంద్రం సీఏఏ చట్టం తెచ్చింది

కవులు, కళాకారులు, మేధావులు ఎటువైపో తేల్చుకోవాలి

విరసం 50 వసంతాల సభలో వక్తలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కొనసాగుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులు, సంస్థలు సంఘటితం కావాలని విప్లవ రచయితల సంఘం (విరసం) పిలుపునిచ్చింది. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకోవాలని కోరింది. ఫాసిజానికి వ్యతిరేకంగా దేశవాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రగతిశీల విద్యార్ధి ఉద్యమాలు ఉత్తేజాన్ని అందజేస్తున్నాయని ప్రశంసించింది. విప్లవ రచయితల సంఘం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న రెండు రోజుల మహాసభలు శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ‘సృజనాత్మక ధిక్కారం యాభై వసంతాల వర్గపోరాట రచన’పేరుతో నిర్వహించిన సభలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ విప్లవ రచయిత, ‘ఆముఖ్‌’పత్రికా సంపాదకుడు కంచన్‌కుమార్, ప్రముఖ కవి యాఖూబ్, ఖాదర్‌ మొహియుద్దీన్, రివేరా, చెంచయ్య, విరసం కార్యదర్శి పాణి, బాసిత్, భోపాల్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్త, రచయిత్రి రించిన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంచన్‌కుమార్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ హిందూ రాజ్య స్థాపన కోసమే బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ముందుకు తెచ్చిందని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఈ చట్టం రద్దు కోసం అన్ని వర్గాలు ఏకం కావాలన్నారు. దేశంలోని ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకే కేంద్రం జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)ను ముందుకు తెస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

నేటికీ నాటి పరిస్థితులే...
భూస్వామ్య, దళారీ బూర్జువా శక్తుల దుర్మార్గమైన, హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల వెలుగులో 1970లో విరసం ఆవిర్భవించగా నేటికీ డెబ్భైల నాటి పరిస్థితులే హిందుత్వ ఫాసిస్టు పాలన రూపంలో ముందుకొచ్చాయని కంచన్‌కుమార్‌ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరణశయ్యపై ఉందని, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జామియా మిలియా, అలీఘడ్, జేఎన్‌యూ విద్యార్థుల పోరాటాలు గొప్ప చైతన్యాన్ని కలిగిస్తున్నాయని, పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక కేంద్రంగా షహీన్‌బాగ్‌ చరిత్రలో నిలిచిపోతుందని, దేశవ్యాప్తంగా మరిన్ని షహీన్‌బాగ్‌లు ఆవిర్భవించాలన్నారు. 
విమలక్క తదితర కళాకారుల సాంస్కృతిక ప్రదర్శన.. 

వర్గ పోరాట దృక్పథంతోనే.. 
విరసం 50 ఏళ్ల వేడుకల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, కవి యూఖూబ్‌ మాట్లాడుతూ మనిషిని ఉన్నతంగా నిలబెట్టడంకోసం ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో విరసం ఎన్నో కష్టాలు, బాధలు, నిర్బంధాలు, హింసను ఎదుర్కొందన్నారు. విరసం సమాజాన్ని ప్రభావితం చేయడమే కాకుండా సమాజం నుంచి నిరంతరం ప్రభావితమవుతుందని విరసం కార్యదర్శి పాణి చెప్పారు.

విరసం ప్రస్థానం ఉజ్వలం: వరవరరావు 
విరసం 50 ఏళ్ల వేడుకల సందర్భంగా భీమా కోరెగావ్‌ కుట్ర కేసులో పుణే జైల్లో ఉన్న విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు తన సందేశాన్ని లేఖ ద్వారా పంపారు. ఆ సందేశాన్ని విరసం సభ్యులు క్రాంతి చదివి వినిపించారు. ‘‘విరసం 50వ పుట్టిన రోజు సందర్భంగా మీ అందరి నుంచి 600 కి.మీ. దూరంలో ఒంటరి ఖైదులో ఉన్నాను. కానీ నా ఆలోచనలు, ఉద్వేగాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 1970 జూలై 4న విరసం స్థాపన సందర్భంగా చేసిన ప్రకటనపై సంతకం చేసిన వాళ్లలో ఇప్పటికీ విరసంలో కొనసాగుతున్న వాడిని నేను ఒక్కడినే. నాడు విరసం వ్యవస్థాపనకు కారణమైన పరిస్థితులను చాలాసార్లు చెప్పుకొన్నాం. ఈ సందర్భంగా విరసం సభ్యులంతా మరోసారి ఫ్రాన్స్‌ అంతర్యుద్ధ కాలాన్ని అధ్యయనం చేయాలి. ఆనాటి పారిస్‌ పరిస్థితులు ఇప్పటి భారత పరిస్థితులకు పెద్దగా తేడాలేదని నేను భావిస్తున్నా. హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు దాడి వల్ల, సామ్రాజ్యవాదంతో దాని మిలాఖత్తు వల్ల ఈ అవసరం మరింత పెరుగుతోంది. 50 ఏళ్ల విరసం పయనం ఎంతో ఉజ్వలమైనది, గర్వకారణమైనది’’అని వరవరరావు తన సందేశంలో చెప్పారు. 

విరసం జెండా ఆవిష్కరణ
సభల ప్రారంభానికి ముందు ఎర్రజెండాను కేరళ హక్కుల కార్యకర్త రావున్ని, విరసం జెండాను విరసం వ్యవస్థాపక సభ్యులు కృష్ణా బాయి ఆవిష్కరించారు. అమరుల స్థూపాన్ని ఇటీవల అమరుడైన దండకారణ్య స్పెషల్‌ జోన ల్‌ కమిటీ కార్యదర్శి రామన్న సోదరుడి కుమారుడు కమలాకర్‌ ఆవిష్కరించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top