నగరంలో ఇద్దరికి కరోనా?

Special Treatment For Corona Patients In Gandhi Hospital - Sakshi

గాంధీ ఆస్పత్రి ప్రత్యేక గదుల్లో చైనీయులకు చికిత్స

మొదటి పరీక్షలో ‘పాజిటివ్‌’.. దీంతో మరోసారి పరీక్షలు

ఆ రిపోర్టులు నేడు వస్తాయంటున్న గాంధీ ఆస్పత్రి వర్గాలు

గత నెల 31నే హైదరాబాద్‌కు చేరుకున్న ఇద్దరు చైనా టెకీలు

వారెక్కడెక్కడ తిరిగారోనన్న దానిపై ఆందోళన..

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించిందా..? హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేసే ఇద్దరు చైనీయులకు కరోనా లక్షణాలున్నాయా అంటే..? గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి చూస్తుంటే ఔననే అం టున్నాయి అక్కడి వర్గాలు. కానీ అధికారి కంగా ధ్రువీకరించడంలేదు. దేశంలో ఇప్పటి వరకు కేరళలో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకగా, ఇప్పుడు హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు చైనీయులకు లక్ష ణాలు ఉన్నాయన్న ప్రచా రంతో ఒక్కసారిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉలిక్కిపడింది. అయితే గాంధీ ఆస్పత్రిలో అధికారులు మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి పాజిటివ్‌ కేసులు లేవంటూనే, శుక్రవారం ఆ చైనీయు లను వైద్య పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతే కాదు కరోనా అనుమానితులు ఎవరైనా వస్తే వారిని ఒకే ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి ఒకే చోట చికిత్స చేస్తుంటారు. కానీ ఈ ఇద్దరు చైనీయులను మాత్రం రెండు ప్రత్యేక గదుల్లో విడివిడిగా చికిత్స చేస్తుండటం కరోనా ప్రవేశించిందనే వాదనలకు బలం చేకూరుస్తోంది. అంతేకాదు వారికి ఒకసారి వైద్య పరీక్ష చేయగా, పాజిటివ్‌ లక్షణాలు, అనుమానాలు రావడంతో రెండోసారి పరీక్షలకు పంపించారు. ఫలితాలు శుక్రవారం వచ్చాక ప్రకటిస్తామని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అన్నీ నిర్ధారించుకున్నాకే ప్రకటిస్తారని అంటున్నారు.

గత నెల 31న చైనా నుంచి రాక...
ఆ ఇద్దరు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 31న వారు చైనాలోని షాంఘై నగరం నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. కరోనా వైరస్‌ చైనాలో విజృంభించిన నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వైరస్‌ లేదని నివేదిక తీసుకొస్తేనే విధుల్లో చేర్చుకుంటామని వారు పనిచేసే సాఫ్ట్‌వేర్‌ కార్యాలయ వర్గాలు ఆదేశించాయి. దీంతో ఆ ఇద్దరు చైనీయులు బుధవారం ఫీవర్‌ ఆస్పత్రికి వెళ్లి అవసరమైన శాంపిళ్లను ఇచ్చారు. అయితే వారు ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి అందిన నివేదికలో ఇరువురికి కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నట్లు ప్రాథమికంగా వైద్యులు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన చైనీయుల కోసం ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ డిసీజెస్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం (ఐడీఎస్‌పీ) అధికారులకు సమాచారం అందించారు. ఐడీఎస్‌పీ అధికారి సదరు చైనీయులు ఉంటున్న అడ్రస్‌లకు వెళ్లి వారిని గురువారం ఉదయం గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసి మరోమారు రక్త నమూనాలు సేకరించి గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో నిర్ధారణ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే గాంధీ వైరాలజీ ల్యాబ్‌లో వీరికి కరోనా పాజిటివ్‌ వచ్చినా తక్షణమే ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది.

పాజిటివ్‌ వచ్చిన నివేదికతోపాటు మరోమారు రక్తనమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబోరేటరీకి పంపాల్సి ఉంటుందంటున్నారు. అక్కడ కూడా కరోనా పాజిటివ్‌ అని తేలితే ల్యాబ్‌ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తారు. అప్పుడు మాత్రమే తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటిస్తుందని వైద్యాధికారులు అంటున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు ఎటువంటి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ స్పష్టంచేశారు. నిర్ధారణ పరీక్ష నివేదికలు వచ్చాక ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. మీడియా సంయమనం పాటించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. గాంధీతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి వచ్చిన 20 రక్త నమూనాలకు గురువారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అర్ధరాత్రి దాటిన తర్వాత నివేదిక వెలువడే అవకాశం ఉందని మరో అధికారి తెలిపారు. అయితే గత నెలలో చైనా నుంచి వచ్చిన ఈ ఇద్దరు ఈ వారం రోజులపాటు హైదరాబాద్‌ నగరంలో ఎక్కడెక్కడ తిరిగారోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

పెరుగుతున్న అనుమానిత కేసులు..
కరోనా అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతోంది. చైనా దాని సమీప దేశాల నుంచి వచ్చిన వారు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే కరోనా నోడల్‌ కేంద్రాలకు చేరుకుని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలా ఇప్పటికే 37 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరందరికీ నెగిటివ్‌ రావడంతో ఆయా బాధితులందరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. గురువారం గాంధీలో మరో 11 మంది.. ఫీవర్‌ ఆస్పత్రిలో 9 మంది చొప్పున కొత్తగా 20 మంది అనుమానితులు చేరారు. చైనా నుంచి ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్న వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు (తల్లి (37), తండ్రి (52), ముగ్గురు కుమారులు 20, 19, 17)తో పాటు షాంఘై నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు (35, 29), హాంకాంగ్‌ నుంచి వచ్చిన మరో ఇద్దరు అనుమానితులు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వీరి నుంచి నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. బాధితుల రిపోర్ట్‌లు ఇంకా రావాల్సి ఉంది.

ఇటు నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలోని కరోనా నోడల్‌ కేంద్రానికి గురువారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని ఓ సంస్థలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు సహా మరో ముగ్గురు యువకులు (మహిళలు (25), (31), పురుషులు (25), (30), (33)) నిర్ధారణ పరీక్షలకు వచ్చారు. వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ఇటీవల చైనా నుంచి వచ్చిన బడంగ్‌పేటకు చెందిన యువతి (27)తో పాటు టోలిచౌకికి చెందిన మరో ఇద్దరి నుంచి నమూనాలు సేకరించారు. అనుమానిత బాధితుల్లో బంజారాహిల్స్‌కు చెందిన వారు ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరించడంతో వారి నుంచి నమూనాలు సేకరించి, హోమ్‌ ఐసోలేషన్‌కు పంపినట్లు తెలిసింది. ఇక ఎల్బీనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆరు నెలల్లోపు శిశువుకు కరోనా లక్షణాలున్నాయంటూ ఆ ఆసుపత్రి యాజమాన్యం గాంధీ ఆసుపత్రికి రిఫర్‌ చేసింది. అయితే దీనిపై గాంధీ ఆస్పత్రి వర్గాలు మండిపడటంతో సంబంధిత యాజమాన్యం ఆ శిశువును డిశ్చార్జి చేసినట్లు తెలిసింది.

సీఎస్‌ సమీక్ష..
కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కంట్రోల్‌ రూంకు వచ్చిన కాల్స్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమందికి ఇప్పటివరకు వైద్య పరీక్షలు చేశారో కూడా తెలుసుకున్నారు. కరోనా వైరస్‌ రాకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాల్లోనూ కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top