పశువులకూ ‘ఆధార్‌’!

A special number and health card for each animal - Sakshi

ప్రతి పశువుకు ప్రత్యేక నంబర్, హెల్త్‌ కార్డు 

సత్ఫలితాలిస్తున్న గొర్రెల పంపిణీ పథకం 

రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మంజులవాణి 

మొయినాబాద్‌ పశువైద్య కేంద్రం ఆకస్మిక తనిఖీ 

మొయినాబాద్‌(చేవెళ్ల): ఇకనుంచి పశువుల ఆరోగ్య వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని.. ప్రతి పశువుకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(ఆధార్‌ వంటిది), హెల్త్‌ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్‌ జి.మంజులవాణి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మండలంలో పశుగణన తీరు, వేసవిలో పశువుల పరిస్థితి , గొర్రెల పంపిణీ పథకం అమలు ఎలా ఉందనే విషయాలను మండల పశువైద్యాధికారి శ్రీలతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న పశువుల సమగ్ర వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని అన్నారు. ప్రతి పశువుకు ఆధార్‌ నంబర్‌ మాదిరిగా 12 అంకెల గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నామని.. గుర్తింపు సంఖ్య ఉన్న పోగును పశువుల చెవులకు వేస్తున్నట్లు వివరించారు.

ప్రత్యేక గుర్తింపు సంఖ్యతోపాటు రైతు వివరాలు కూడా ఫీడ్‌ చేస్తామన్నారు. పశువు వివరాలతోపాటు దాని ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తున్నామని తెలిపారు. వాటికి హెల్త్‌కార్డులు సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు. పశు సంపదను పెంచే చర్యలు ముమ్మరం చేసినట్లు తద్వారా పాలఉత్పత్తి పెంచి రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు.

గొర్రెల పంపిణీ పథకం కింద అందజేసిన జీవాల ద్వారా రాష్ట్రంలో 50 లక్షల గొర్రెపిల్లలు ఉత్పత్తి అయ్యాయన్నారు. రెండో విడత పంపిణీ త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. అనంతరం శ్రీరాంనగర్‌ గ్రామాన్ని సందర్శించి దూడలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్‌డీఓ ఈఓ కె.సింహరావు, పశువైద్యులు దేవేందర్‌రెడ్డి, శ్రీలత, గోపాలమిత్రలు శ్రీనివాస్, బాలకిష్టయ్య తదితరులు ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top