భరించొద్దు.. చెప్పుకోండి

Special Classes About She Teams To Students - Sakshi

పాఠశాలల్లోనూ ‘షీ– టీమ్స్‌’ కౌన్సెలర్లు

విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు  యత్నం

‘‘ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలిక గర్భం దాల్చడం తీవ్ర కలకలం రేపింది. ఆ బాలిక శరీరంలో వస్తున్న మార్పుల్ని గమనించిన ఉపాధ్యాయులు వైద్యపరీక్షలు చేయించడంతో ఈ విషయం వెలుగుచూసింది’’. ‘‘స్కూలుకు వెళ్లే దారిలో ఓ బాలికను రోజూ పోకిరీ వేధిస్తున్నాడు. ఇంట్లో చెబితే తల్లిదండ్రులు కూడా తననే తిట్టడంతో బాలిక లోలోన కుమిలిపోతోంది’’. 

సాక్షి, హైదరాబాద్‌: ఇలాంటి ఘటనలకు చరమగీతం పాడాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లోనూ షీ–టీమ్స్‌ కౌన్సెలర్లను నియమించాలని వుమెన్‌ సేఫ్టీ వింగ్‌ నిర్ణయించింది. ఐదేళ్లలో వేలాది కేసులను పరిష్కరించిన షీ–టీమ్స్‌ ఇప్పటిదాకా మహిళలు, ఉద్యోగినులు, వర్సిటీ విద్యార్థులకు మాత్రమే అవగాహన కల్పించింది. కానీ, విస్తరిస్తోన్న స్మార్ట్‌ఫోన్ల సంస్కృతి, సినిమాలు టీనేజీ పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. వారు చేజేతులారా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు తమకు జరుగుతున్న వేధింపులను ఎవరికి చెప్పాలో తెలియక మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి దుస్థితికి చెక్‌పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

కౌన్సెలర్లు ఏం చేస్తారు? 
రాష్ట్రంలోని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల ఆధ్వర్యంలో ‘షీ–టీమ్స్‌’బృందా లు 300కుపైగా నిత్యం మహిళల రక్షణలో తలమునకలవుతున్నాయి. ఐదేళ్ల కాలంలో 33,687 కేసులను ఈ బృందాలు పరిష్కరించాయి. ఇక నుంచి వీరికి కౌన్సెలర్లు తోడు కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 17,75,409 మంది బా లికలు ఉన్నారు. వీరందరికీ సైబర్, ఫోన్స్, సోషల్‌మీడి యా తదితర వేధింపులు వ చ్చినపుడు ఎలా స్పందించా లి? షీ–టీమ్స్‌ను ఎలా సం ప్రదించాలో కౌన్సెలర్లు అవగాహన కల్పిస్తారు.

మౌనం వీడితేనే.. 
బాలికలపై జరుగుతున్న వేధింపుల్లో చాలామటుకు వెలుగులోకి రావడం లేదు. విద్యార్థినులు మౌనం వీడాలి. వేధింపులను భరించాల్సిన అవసరం లేదు. టీనేజీలో పిల్లల మనసు సున్నితమైంది. ఈ సమయంలోనే వారికి ధైర్యంగా జీవించడం నేర్పాలి. మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం, పెంచేందుకు మా కౌన్సెలర్లు కీలకపాత్ర పోషిస్తారు.
– స్వాతి లక్రా, ఐజీ, వుమెన్స్‌ సేఫ్టీ వింగ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top