కరోనా : హాయిగా.. స్వేచ్ఛగా విహరిస్తాం

Special Article About Kavval Wlidlife Sanctuary  - Sakshi

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వన్యప్రాణులకు మాత్రం వరంగా మారింది. జన సంచారం, పశువులు, కాపరుల అలజడి లేకపోవడంతో వన్యప్రాణులు హాయిగా.. స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వేటగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకొని తిరిగే మూగజీవాలు.. ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో.. ఏ మాత్రం భయపడకుండా తిరుగుతున్నాయి. ప్రకృతి ఒడిలో పూర్తిగా మమేకమవుతున్నాయి. అటవీ అధికారులు సైతం వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోని జన్నారం అటవీ ప్రాంతంలో, నాగర్‌కర్నూలు జిల్లా నల్లమలలో, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల పరిధిలోని అభయారణ్యంలో వన్యప్రాణుల కదలికలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

జన్నారం : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో నెల రోజులుగా అటవీ ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్రధాన రహదారికి కూత వేటు దూరం అటవీ ప్రాంతానికి వెళ్తేనే.. లేడి పిల్లలు చెంగు చెంగున పరుగులు పెడుతున్నాయి. నీలుగాయిలు, మెకంలు, దుప్పులు, అడవి దున్నలు, సాంబర్లు ఇలా.. ఒక్కటేమిటి ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. కాసేపు సరదాగా ఆడుకుందాం అనే రీతిలో కనిపిస్తున్నాయి. వీటికి తోడు గ్రామాల్లో తిరిగే కొండముచ్చులు, కోతులు కూడా అడవిబాట పట్టాయి. దీంతో నిత్యం కోతులతో ఇబ్బందులు పడుతున్న జనానికి కాస్త ఉపశమనం లభించినట్లయింది.

కాగా, వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాసర్‌ వెల్స్, కుంటలు, సోలార్‌ పంపుసెట్లు, ర్యాంపు వెల్స్, నీటి చెలిమెలు తవ్వారు. జన్నారం డివిజన్‌ పరిధిలో సుమారు 20 సోలార్‌ పంపుల ద్వారా నీటి వసతి కల్పిస్తున్నారు. వాటి ద్వారా నీటిని కుంటల్లోకి వదులుతున్నారు. కన్హా టైగర్‌ రిజర్వ్‌లో ఏర్పాటు చేసిన మాదిరిగా ప్రకృతి సిద్ధమైన నీటి చెలిమెలు తవ్వించారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల ఓ పులి సంచారం ఎక్కువైంది. తాండూర్, నెన్నెల ప్రాంతాల పరిధిలో పులి సూర్యాస్తమయం కాకుండానే జనారణ్యంలోకి వస్తోంది. ఇక జన్నారం అటవీ రేంజ్‌లలో వివిధ రకాల పక్షులు దర్శనమిస్తున్నాయి. కొంగల విహారం కనువిందు చేస్తోంది. అరుదైన పక్షులు విజిలింగ్‌డక్స్, పేయింటెడ్‌ స్టోర్క్స్, బ్లాక్‌నెక్‌డ్, ఉలినెక్‌డ్‌ పక్షులు దర్శనమిస్తున్నాయి. ఈ పక్షులు దేశంలో అరుదుగా కనిపిస్తాయని అటవీ అధికారులు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top