
సాక్షి, హైదరాబాద్: కొంతమంది 60 ఏళ్లలోనూ ఇరవై ఏళ్ల మాదిరిగానే ఉంటారు. ఇదేలా సాధ్యమో తెలుసుకునేందుకు లాసన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తియనీ హెల్త్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ (చైనా) అధ్యయనం జరిపింది. పేగుల్లో ఉండే కొన్ని బ్యాక్టీరియా రకాలు వయసుతోపాటు వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నియంత్రిస్తున్నట్లు స్పష్టమైంది. వెయ్యి మంది చైనీయులను పరిశీలించిన తర్వాత ఈ అంచనాకు రాగలిగామని, వీరిలో మూడేళ్ల నుంచి వందేళ్ల వయసు వారు ఉన్నారని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త గ్రెగర్ రీడ్ తెలిపారు.
శరీరంలోని సూక్ష్మజీవులను బట్టి ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వందేళ్ల వయసున్న వారి పేగుల్లోని సూక్ష్మజీవులు, 30 ఏళ్ల వయసులోని వారి సూక్ష్మజీవులు దాదాపు ఒకేలా ఉన్నాయని చెప్పారు. చిత్రంగా 19–24 మధ్య వయసు వారిలోని సూక్ష్మజీవులు మిగిలిన వారందరి కంటే భిన్నంగా ఉన్నాయని మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకుంటామని రీడ్ చెప్పారు.