
సాక్షి, హైదరాబాద్: శరవేగంగా సాగుతున్న తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు వదిలిన బాణమే రేవంత్‌రెడ్డి అని దుబ్బాక ఎమ్మెల్యే, అంచనాలు పద్దుల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన శాసనసభ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై రేవంత్ ప్రకటిస్తున్న విశ్వాసం, ఆయన చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అటు గోదావరి, ఇటు కృష్ణా నదుల మీద కడుతున్న ప్రాజెక్టులు అడ్డుకోవటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవటంతో చివరి అస్త్రంగా రేవంత్‌రెడ్డిని వదిలారన్నారు. తెలుగుదేశం పార్టీకి, పదవులకు రాజీనామా చేసిన రేవంత్, నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఎంతమంది ఎమ్మెల్యేలను కొనమని ఎంత డబ్బిచ్చాడో గుట్టు విప్పితే తెలంగాణ ప్రజలు ఆయన విశ్వసనీయతను నమ్ముతారన్నారు.