ఆర్టీసీకి సౌరకాంతులు

Solar Plants in all bus stands by March 31 - Sakshi

మార్చి 31లోగా అన్ని బస్టాండ్లలో ప్లాంట్లు

4,458 కిలోవాట్ల ఉత్పత్తి... ఏటా రూ.2.25 కోట్ల మిగులు

ఫిబ్రవరి 15 నాటికి జేబీఎస్, ఎంజీబీఎస్‌లో ప్లాంట్లు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయం పెంచుకోవడం, దుబారా ఖర్చు నియంత్రణలో భాగంగా ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, డిపోల్లో సోలార్‌ప్లాంట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ శక్తి అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఆర్‌ఈడీసీవో)తో టీఎస్‌ ఆర్టీసీ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో టీఎస్‌ ఆర్టీసీ ఈడీ (రెవెన్యూ) సంస్థ కార్యదర్శి పురుషోత్తమ్‌ సోమవారం రెడ్‌కో సంస్థ ప్రతినిధులతో బస్‌భవన్‌లో సమావేశం అయ్యారు. వివిధ బస్టాండ్లు, డిపోల్లో సోలార్‌ప్లాంట్ల ఏర్పాటు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. 

మూడు సంస్థలకు టెండర్లు.. 
తెలంగాణలోని 97 డిపోల్లో సోలార్‌ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఇందుకోసం కార్వీ, వార్ప్, సన్‌ టెక్నాలజీస్‌ సంస్థలను ఎంపిక చేసింది. చాలా చోట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిసింది. 97 సోలార్‌ పవర్‌ప్లాంట్లన్నీ కలిపి మొత్తం 4,458 కిలోవాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నాయి. ఫలితంగా నెలకు రూ.18.75 లక్షల చొప్పున, సాలీనా రూ. 2.25 కోట్లు సంస్థకు భారం తప్పుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

15 నాటికి ఎంజీబీఎస్, జేబీఎస్‌లో
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌), జూబ్లీబస్టాండ్‌ (జేబీఎస్‌)లోనూ ఈ పనులు సాగుతున్నాయి. వీటిలో ఎంజీబీఎస్‌లో 300 కిలోవాట్ల సామర్థ్యంతో అతిపెద్ద సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జేబీఎస్‌లోనూ 100 కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. 2019 మార్చినాటికి రాష్ట్రవ్యాప్తంగా విద్యుదుత్పత్తి ప్రారంభిస్తాయని, వచ్చే ఏడాది మార్చినాటికి రూ.2 కోట్లకు పైగా విలువైన విద్యుత్తును ఆదా చేయాలని ఆర్టీసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top