అతివేగానికి ఆరుగురు బలి | six members dead in a road accident | Sakshi
Sakshi News home page

అతివేగానికి ఆరుగురు బలి

Dec 11 2014 4:04 AM | Updated on Aug 30 2018 3:58 PM

అతివేగానికి ఆరుగురు బలి - Sakshi

అతివేగానికి ఆరుగురు బలి

భద్రాచలం- చట్టి జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు మృతిచెందారు.

భద్రాచలం రూరల్/ చింతూరు: భద్రాచలం- చట్టి జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు మృతిచెందారు. నెల్లిపాక, చింతూరు మండలాల సరిహద్దుల్లోని కాటుకపల్లి- బండిరేవు మధ్య కుంట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్తున్న మహీంద్రా మ్యాక్స్ వాహనం వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహీంద్రా వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మహీంద్రా మ్యాక్స్ వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వాహనానికి బస్సు ఎదురుగా వచ్చింది.

వేగంలో నియంత్రించలేక మహీంద్ర వాహనం డ్రైవర్ బస్సును ఢీకొట్టాడు. మహీంద్రా వాహనం బస్సు ముందు నుంచి సగభాగంలోకి దూసుకుపోయింది. ముందు సీట్లో కూర్చున్న ముగ్గురి మృతదేహాలు రెండు వాహనాల నడుమ ఇరుక్కుపోయాయి. భద్రాచలం, చింతూరు పోలీసులతో పాటు అనేకమంది ప్రయాణికులు గంటపాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారంటే వాహనం ఎంత వేగంగా వెళ్తుందో అర్థమవుతోంది. ఈ ప్రమాదంలో జగన్ వశీకర్ అనే వ్యక్తి తీవ్రగాయాలతో బయటపడ్డాడు. భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వశీకర్

తెలిపిన వివరాల ప్రకారం...
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కేర్లాపాల్ గ్రామానికి చెందిన గజానన్ భద్రే కుటుంబం ఆస్పత్రి పని మీద మహీంద్రా వాహనంలో భద్రాచలం వచ్చింది. తిరిగి వెళ్తుండగా బండిరేవు, కాటుకపల్లి మధ్య విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వీరు ప్రయాణిస్తున్న మహీంద్రా వాహనం వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గజానన్ భద్రే, సంతోష్, మహేష్ భద్రే, ప్రమీలా, కరీనాలతో పాటు డ్రైవర్ లక్ష్మీనాథ్ అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం సగ భాగం బస్సులోకి దూసుకెళ్లింది. ముందుభాగంలో కూర్చున్న ముగ్గురు, నడుమ సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళల మృతదేహాలు వాహనం వేగానికి నలిగిపోయాయి.

ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో ముగ్గురు వ్యక్తులు బతికే వున్నారని కొద్దిసేపటి అనంతరం ప్రాణాలు విడిచారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే చింతూరు సీఐ అమృతరెడ్డి, ఏడుగురాళ్లపల్లి ఆర్‌ఎస్‌ఐలు సోమ్లానాయక్, శంకరప్రసాద్, భద్రాచలం రూరల్ ఎస్‌ఐలు రాజు, యాదగిరిలు సంఘటనస్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలిని భద్రాచలం ఏఎస్‌పీ ప్రకాశ్‌రెడ్డి సందర్శించారు. సుమారు 2 గంటలపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌తో పాటు మరికొంత మంది ప్రయాణీకులకు స్వల్పంగా గాయాలయ్యాయి. భద్రాచలం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement