చంద్రయాన్‌–2లో మనోడు..

Siddipet Scientist Has Part In Chandrayaan 2 Project - Sakshi

సిద్దిపేట ముద్దుబిడ్డకు అపూర్వ గౌరవం

సామాన్య కుటుంబం నుంచి శాస్త్రవేత్తగా..

20 ఏళ్లుగా షార్‌లోని పలు విభాగాల్లో విధుల నిర్వహణ

సిద్దిపేట జోన్‌/సిద్దిపేట రూరల్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగిస్తున్న చంద్రయాన్‌–2 ప్రాజెక్టులో సిద్దిపేట జిల్లా వాసి వీరబత్తిని సురేందర్‌ పాత్ర ఉండటం తెలంగాణకు గర్వకారణం. సురేందర్‌ గత 20 ఏళ్లుగా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో స్పేస్‌ వెహికిల్స్‌ రాడార్‌ కమ్యూనికేషన్, టెలి కమాండ్‌ సిస్టం, ఎలక్ట్రికల్‌ సిస్టంతో పాటు పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సిద్దిపేటలోని చేనేత కుటుంబంలో జన్మించిన సురేందర్‌ కష్టాలను సహవాసంగా స్వీకరిస్తూ అంచెలంచెలుగా శాస్త్రవేత్తగా ఎదిగారు. తల్లి దండ్రులు వీరబత్తిని సత్తయ్య, రాజమణిలకు ఉన్న ముగ్గురు కుమారుల్లో రెండో వాడు సురేందర్‌. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి రాజమణి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుమారులను ప్రయోజకులుగా చేశారు. సురేందర్‌ విద్యార్థి దశ నుంచే గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆయన విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. 10వ తరగతి అనంతరం నిజా మాబాద్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (రాంచీ)లో మాస్టర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. శాస్త్రవేత్తగా ఎదగాలన్న ఆశయంతో కొత్తగూడెం ఏపీ జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా, పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌ ఉద్యోగాన్ని వదులుకున్నారు.

20 ఏళ్ళుగా...
ఈసీఐఎస్‌లో పనిచేస్తున్న క్రమంలోనే సురేందర్‌కు శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌లో ఉద్యోగం వచ్చింది. 2000లో షార్‌లో చేరిన సురేందర్‌ అంతరిక్షంలో ఉపగ్రహాలను పంపే ప్రతి ప్రక్రియలో భాగస్వాముడిగా మారారు. పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ లాంటి ప్రయోగాల్లో కూడా తనవంతు పాత్ర నిర్వర్తించారు. 

చాలా ఆనందంగా ఉంది..
‘నా బిడ్డ సురేందర్‌ మొండివాడు.. ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని కచ్చితంగా చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాం. కష్టపడి చదువుకునే మనస్తత్వం కలిగిన నా కొడుకు గురించి ఇప్పుడు పేపర్లో, టీవీల్లో వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తల్లి దండ్రులుగా మాకు ఇంతకంటే ఏమి కావాలి. దేశం కోసం సేవ చేస్తున్న కుమారుడుని చూస్తే కడుపు నిండుతోంది’అంటూ సురేందర్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top