
శివ తో హైలైట్
సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త ట్రెండ్ సృష్టించిన శివ చిత్రంలో కొంత భాగాన్ని కూకట్‌పల్లిలో చిత్రీకరించారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం కూకట్‌పల్లి జాతీయ రహదారి పక్కన...
- 25 సంవత్సరాల క్రితం హోటల్ హైలైట్‌లో సినిమా షూటింగ్
- జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న కూకట్‌పల్లి వాసులు
సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త ట్రెండ్ సృష్టించిన శివ చిత్రంలో కొంత భాగాన్ని కూకట్‌పల్లిలో చిత్రీకరించారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం కూకట్‌పల్లి జాతీయ రహదారి పక్కన వివేకానందానగర్ కాలనీ కమాన్‌ను ఆనుకొని ఉన్న హైలైట్ హోటల్‌లో శివ సినిమా షూటింగ్ జరిగింది. హీరో నాగార్జున తన మిత్రులతో కలసి ఇరానీ ఛాయ్ తాగుతూ సరదాగా చర్చించుకునే సన్నివేశాన్ని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇక్కడ చిత్రీకరించారు. వర్మ సోదరి వివేకానందానగర్‌లో నివాసం ఉండటంతో అతను ఇక్కడికి వచ్చి పోతూ ఈ హోటల్‌లో ఇరానీ ఛాయ్ తాగేవాడు. దీంతో ఈ హోటల్‌ను షూటింగ్ కోసం ఎంచుకున్నారని హోటల్ నిర్వాహకులు తెలిపారు. సినిమా షూటింగ్ అనంతరం హైలైట్ హోటల్ పేరుతో కాక శివ హోటల్‌గానే పిలుచుకుంటున్నారు. అయితే అప్పుడే కొత్తగా మున్సిపాలిటీగా అవతరించిన కూకట్‌పల్లిలో మొదటి సినిమా షూటింగ్ కూడా శివ చిత్రమే కావడం గమనార్హం. అంతేకాక శివ-2 సినిమాను కూడా ఈ హోటల్ నుంచే ప్రారంభించాలని దర్శకుడు రాంగోపాల్‌వర్మ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. - కూకట్‌పల్లి
షూటింగ్ జరపడం సంతోషం
హోటల్ ప్రారంభించిన సమయంలోనే నాగార్జునతో పాటు సినిమా యూనిట్ సభ్యులంతా మా హోటల్‌లో రెండు రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. గంటల తరబడి వారితో గడిపాం. షూటింగ్ సమయంలో మా చిన్నబాబుకు ఒక్క సంవత్సరం వయస్సు. దాంతో నాగార్జున మా అబ్బాయిని ఎత్తుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులందరూ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. మా హోటల్‌లో షూటింగ్ జరుపుకున్న చిత్రం సంచలనాలు సృష్టించడం చాలా సంతోషంగా ఉంది.
- సాధిక్ సేట్, హోటల్ యజమాని
షూటింగ్‌ను తిలకించా
హైలైట్ హోటల్ ప్రారంభించిన సమయం నుంచి నేను పాలు సరఫరా చేస్తున్నాను. షూటింగ్ సమయంలో నేను హోటల్‌కు పాలు సరఫరా చేయడంతో ప్రత్యక్షంగా సినిమా చిత్రీకరణ చూశాను. అప్పటి నుంచి కూడా ప్రతి రోజు హోటల్‌కు వచ్చి ఛాయ్ తాగి వెళ్తుంటాను. హోటల్ ఆ సమయంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది.
- మొలుగు వెంగళ్‌రావు, కూకట్‌పల్లివాసి.