మూగజీవాలకు బీమా కాపరిలో ధీమా | Sakshi
Sakshi News home page

మూగజీవాలకు బీమా కాపరిలో ధీమా

Published Thu, Aug 14 2014 3:49 AM

shepherd confidence of animals insurance

న్యూ ఇండియా, ఓరియంటల్, యునెటైడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లు జనరల్ ఇన్సూరెన్స్ చేస్తున్నాయి. జీవాల పెంపకందారులు స్వయంగా జీవాలకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ తో కూడిన రుణాల ద్వారా పంపిణీ చేసిన జీవాలకు ముందే బీమా చేయిస్తుంది. నాలుగు మాసాల నుంచి ఏడేళ్లలోపు జీవాలన్నింటికీ(గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, మేకపోతులు) బీమా చేయవచ్చు.

 ప్రీమియం రేట్లు
 పశువైద్యులు నిర్ణయించిన జీవాల విలువపై 3 నుంచి 5 శాతం మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. దేశవాళీ జీవాలకు 4 శాతం, సంకర జాతి జీవాలకు 5 శాతం, విదేశీ జాతి జీవాలకు 3 శాతం, ప్రభుత్వం సబ్సిడీపై అందించే జీవాలకు 2.75 శాతం ప్రీమియం వసూలు చేస్తారు. జనరల్ ఇన్సూరెన్స్ కాబట్టి ప్రీమియం తిరిగిరాదు. జీవాలు మరణిస్తే పరిహారం అందుతుంది.

 డిస్కౌంట్ ఆఫర్లు
వంద నుంచి పది వేల వరకు జీవాలకు ఇన్సూరెన్స్ చేస్తే ప్రీమియంలో 5 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు.
     
50+2 మందను ఇన్సూరెన్స్ చేస్తే ప్రీమియంలో 2.5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
     
జీవాలు 80 కి.మీ. దాటి మేతకు వెళ్తే ప్రీమియం మొత్తం పెరుగుతుంది.
 
పరిహారం ఎప్పుడు లభిస్తుంది
 ప్రమాదం వల్ల, వ్యాధులు సోకడం వల్ల, ఆపరేషన్ చేయించిన తర్వాత, దోపిడీ జరిగినప్పుడు, అగ్నిప్రమాదాలు, పిడుగులు, వరదలు, భూకంపాలు, కరువు కాటకాలు, తుఫానులు మొదలగు సందర్భాల్లో జీవాలు మరణిస్తే నష్టపరిహారం లభిస్తోంది.
 
ఈ సందర్భాల్లో వర్తించదు
 ఇన్సూరెన్స్ చేసిన జీవాలకు యుద్ధం వల్ల నష్టం జరిగినా, అంటువ్యాధులు సోకి మరణించినా, ఉద్దేశపూర్వకంగా వ్యాధికి సరైన చికిత్స, ఆహారం అందించకపోయినా, ఒక జీవం చెవిపొగును మరొక జీవానికి మార్చినా, తెలిసీతెలియని వైద్యం అందించినా.. మరణించిన జీవానికి ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం అందించవు. బీమా గడువు పూర్తికావడం, ధ్రువపత్రాలు సరిగ్గా లేకపోవడం, చెవిపొగు లేకపోవడం వంటి సందర్భాల్లోనూ నష్టపరిహారం అందదు.

Advertisement
Advertisement