కూటమికి ఓటేస్తే శనేశ్వరమే.. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం

Shaneswaram is the vote for the Alliance. If TRS is won, Kaleshwaram - Sakshi

రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు

గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం

బొమ్మలరామారంలో బహిరంగ సభ, భువనగిరిలో రోడ్‌షో

సాక్షి, బొమ్మలరామారం : ‘‘టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటేస్తే కాళేశ్వరం.. కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుంది.. ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలి’’ అని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బొమ్మలరామారం, భువనగిరిలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభ, రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ద్రోహులకు, ఉద్యమకారులకు జరుగుతున్న ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. పైళ్ల శేఖర్‌రెడ్డి, సునీత గెలుపును ఏ శక్తీ ఆపలేదన్నారు.  

టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తామని, కూటమికి ఓటేస్తే శనేశ్వరమే గతని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీర్వాదం పొందిన ఆలేరు అసెంబ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డిని బంపర్‌ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

గత పాలకుల హయాంలో రైతులకు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్ల బాధ ఉండేదన్నారు. కేసీఆర్‌ పాలనలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారు. రైతు పక్షపాతిగా కేసీఆర్‌ రైతు బీమా పథకం లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 90 శాతం పూరైన కొండ పోచమ్మ ప్రాజెక్ట్‌ ద్వారా కాలేశ్వరంకు అక్కడి నుంచి షామీర్‌పేట్‌ రిజర్వాయర్‌ నింపి లక్షా 57 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆసరా పింఛన్‌ డబ్బులను డబుల్‌ చేస్తామని, ప్రతి బీడీ కార్మికురాలికి పీఎఫ్‌ కార్డుతో నిమిత్తం లేకుండా రెండు వేల పింఛన్‌ ఇస్తామన్నారు. భిక్షమయ్యగౌడ్‌పై భూ కబ్జా కేసులుంటే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిపై తెలంగాణ ఉద్యమ కేసులున్నాయన్నారు. తెలంగాణ ద్రోహులకు ఉద్యమకారులకు జరిగే ఎన్నికల్లో ఎవరికి పట్టంకట్టాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

ఏ శక్తీ సునీత గెలుపును ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే యాదగిరిగుట్టకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సవాల్‌ విసిరారు. చంద్రబాబు ఫొటో ఉంటే ఓట్లు రావని పత్రిక ప్రకటనల్లో ఆయన చిత్రాన్ని తొలగించారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అడ్డుకున్న ఆంధ్రాబాబు   తెలంగాణకు మేలు చేస్తాడని కోదండరామ్‌ అనడం దారుణమన్నారు. ఆలేరు అసెంబ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆలేరుకు సాగు నీరు తేవడమే తన ముందున్న లక్ష్యమన్నారు.

తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని పోరాటం చేశామని, ఆ కలలు సాకారం కావాలంటే టీఆర్‌ఎస్‌ గెలుపే శరణ్యమన్నారు. ఆలేరులో మిషన్‌ కాకతీయ ద్వారా 590 చెరువులకు మరమ్మతులు జరిగాయన్నారు. మండలం లో మునీరాబాద్, ఖాజీపేట్‌ వద్ద చెక్‌ డ్యాం నిర్మి స్తామన్నారు. షామీర్‌పేట్‌ ద్వారా సాగు నీరు అం దించి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని హా మీ ఇచ్చారు. అంతకు ముందు మండల కేం ద్రం లోని గుడిబావి చౌరస్తా నుంచి సభాస్థలి వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం మం డలంలోని పలు పార్టీల నుంచి పెద్ద సంఖ్య లో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆల్ధా చైర్మన్‌ మోతే పిచ్చిరెడ్డి, ఆలేరు మర్కెట్‌ కమిటీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్, ఎంపీపీలు తిరుపతిరెడ్డి, గడ్డమీది స్వప్న, రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీలు జయమ్మ, రాజిరెడ్డి,  ఉమరాణి, శ్రీశైలం, మన్నె శ్రీధర్, లక్ష్మి పాల్గొన్నారు.  

శేఖర్‌రెడ్డి గెలిస్తేనే కాళేశ్వరం ఏర్పాటు
భువనగిరి : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు రావాలంటే పైళ్ల శేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి భువనగిరిలో జరిగిన రోడ్‌షోలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పైళ్ల శేఖర్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా రావడం నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతో తెలంగాణకు న్యాయం జరగలేదన్నారు. గత ప్రభుత్వాలు రూ.200 పింఛన్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌ రూ.1000 ఇచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాగానే దానిని రూ.2,016కు పెంచుతామన్నారు. ప్రతి రైతుకు ఎకరానికి సంవత్సరంలో రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని పేర్కొన్నారు.  

పెట్టుబడి సాయం రావాలంటే కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు.  బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను సాధించిన ఘనత కేసీఆర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల  శేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. భువనగిరి అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని దివంగత మంత్రి మాధవరెడ్డి తర్వాత  ఆ విధంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.  ఈనెల 7న జరిగే ఎన్నికల్లో పైళ్ళ శేఖర్‌రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. 

మళ్లీ ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తా
2014 ఎన్నికల మాదిరిగా మళ్లీ ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆదరిస్తే భువనగిరి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి,  మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో భువనగిరి నియోజకవర్గంలో సాగు నీటి వనరులతోపాటు రోడ్లను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2,016 పింఛన్‌ ఇస్తామన్నారు.  బీబీనగర్‌ నిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిమ్స్‌ ఆసుపత్రిని ఎయిమ్స్‌గా మార్చేందుకు చేసిన కృషి టీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కుతుందన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ కొలుపుల అమరేందర్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, అందెల లింగం యాదవ్, ఎలిమి నేటి సందీప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నువ్వుల ప్రసన్న, వైస్‌ చైర్‌పర్సన్‌ బర్రె మహాలక్ష్మి, చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, పంతులు నాయక్, గోమారి సుధాకర్‌రెడ్డి, జనగాం పాండు, సత్తిరెడ్డి, జెడ్‌పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top