ఆపరేషన్లు ఆగిపోయాయ్‌! 

Serious problems in Osmania and Nims and Gandhi and Nilofer Hospitals - Sakshi

ప్రభుత్వ వైద్యంపై జూడాల సమ్మె ప్రభావం 

ఉస్మానియా, నిమ్స్, గాంధీ, నిలోఫర్‌లో తీవ్ర సమస్యలు 

ఆందోళనలో రోగులు.. ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ వైద్య కమిషన్‌ బిల్లుకు నిరసనగా వైద్యులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. 3రోజుల క్రితం ఓపీ సేవలు ఆపేసి ఆందోళన చేపట్టిన వైద్యులు గురువారం మధ్యాహ్నం నుంచి అత్యవసర వైద్యసేవలనూ బహిష్కరించిన విషయం తెలిసిందే. జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రి ఓపీకి చేరుకున్న ఔట్‌ పేషెంట్లకే కాకుండా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ అత్యవసర విభాగాలకు చేరుకున్న రోగు లూ వైద్యసేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగా.. మరి కొందరు ఆస్పత్రి ప్రాంగణాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. రోజంతా ఏకధాటిగా కురుస్తున్న వర్షం, వైద్యులు సమ్మెకు దిగిన సమాచారంతో ఆయా ఆస్పత్రులకు రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉండగా పార్లమెంట్‌లో జాతీయ వైద్య కమిషన్‌ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. దానిని ఉపసంహరించే వరకు ఆందోళనను విరమించేది లేదని వైద్యులు మరోసారి స్పష్టం చేశారు. 

అత్యవసరం తప్ప అంతా బంద్‌! 
సాధారణ రోజుల్లో ఉస్మానియాలో రోజుకు సగటున 150, గాంధీలో 200, నిలోఫర్‌లో 40–50, ఈఎన్‌టీలో 25, నిమ్స్‌లో 250 వరకు చిన్నాపెద్దా సర్జరీలు జరుగుతాయి. అయితే జూడాల సమ్మెతో 30% సర్జరీలు వాయిదా వేయాల్సి వచ్చింది. అత్యవసర సర్జరీ లు కొనసాగినప్పటికీ.. మిగిలిన ఆపరేషన్లను వాయి దా వేశారు. ఇప్పటికే సర్జరీకి డేట్‌ తీసుకుని, ఉదయాన్నే ఆయా ఆపరేషన్‌ థియేటర్ల వద్దకు చేరుకున్న బాధితులు తీరా ఆపరేషన్‌ వాయిదా వేసినట్లు తెలిసి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. గాంధీ ఆస్పత్రి లోని జూడాల సామూహిక ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. కోఠి ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేయగా, ఉస్మానియాలో పాతభవనం ముందు ఆందోళన చేపట్టారు. నిలోఫర్‌ చిన్నపిల్లల దవాఖానాలో సకాలం లో వైద్య సేవలు అందక పసిపిల్లలు అవస్థలు పడుతున్నారు. నిమ్స్‌లో రెసిడెంట్‌ వైద్యులు విధులు బహిష్కరించడంతో అత్యవసర విభాగానికి చేరుకు న్న రోగులకే కాకుండా ఆస్పత్రిలోని వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు వైద్యసేవలు అందలేదు. 

స్టాఫ్‌ నర్సులే పెద్దదిక్కు: జూనియర్లు సమ్మెలో ఉండటంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తాత్కాలికంగా సెలవులను రద్దు చేశారు. సీనియర్‌ ఫ్యాకల్టీ మొత్తాన్ని ఓపీ, ఐపీ, అత్యవసర విభాగాల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 9 గంటలకే ఐపీ రౌండ్స్‌ నిర్వహించాల్సిన సీనియర్‌ వైద్యులు ఓపీలో కూర్చోవడంతో ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులకు స్టాఫ్‌నర్సులే పెద్దదిక్కుగా మారారు. ఇప్పటికే ఆస్పత్రిలో అడ్మిటైన వారికి సర్జరీ కోసం ఎదురు చూపులు తప్పలేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top