దర్శకులుగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు

Sekhar kammula Who Is Software Engineer Change To Movie Director - Sakshi

చిత్రసీమను ఏలుతున్న ఐటీ నిపుణులు

వినూత్న కథలతో ఆకట్టుకుంటున్న యువకులు

డాక్టర్‌ను కాబోయి యాక్టర్‌నయ్యానని చాలా మంది నటులు చెబుతుంటారు. అయితే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లం కాబోయి డైరెక్టర్లమయ్యామంటున్నారు నేటితరం దర్శకులు. దిగ్గజ దర్శకుడు శేఖర్‌ కమ్ముల మొదలుకుని నిన్నటి క్షీరసాగర మథనం దర్శకుడు అనిల్‌ పంగులూరి వరకు పలువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఐటీ రంగం నుంచి ఎందరో ప్రతిభాశాలురు దర్శకులుగా పరిచయమవుతున్నారు. శేఖర్‌ కమ్ముల స్ఫూర్తిగా చాలా మంది యువ దర్శకులు సాఫ్ట్‌వేర్‌ కొలువులను పక్కనబెట్టి దర్శకత్వంలో రాణిస్తున్నారు. హిట్‌ సినిమాలకు రూపకల్పన చేస్తున్నారు. చిత్రపరిశ్రమలో ఇప్పుడంతా ఐటీ రంగం నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల హవా కొనసాగుతోంది.
– బంజారాహిల్స్‌          
 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్థానం చిత్ర దర్శకుడు దేవా కట్టా,  గౌతం (జెర్సీ), తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లి చూపులు)  వెన్నెల కిశోర్‌ (జఫ్పా), ప్రవీణ్‌ సత్తారు (గరుడవేగ), శ్రీహర్ష మందా (రామచక్కని సీత), సందీప్‌ (అర్జున్‌రెడ్డి), మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌), నీలకంఠ (మిస్సమ్మ).. ఇలా చెబుతూపోతే చాలా మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు తమ దర్శకత్వ ప్రతిభతో చిత్రసీమను ఏలుతున్నారనే చెప్పాలి. చక్కని కథనాలతో వీళ్లు తెరకెక్కిస్తున్న సినిమాలు హిట్‌ అవుతున్నాయి. ఐబీఎంలో పనిచేసిన ప్రవీణ్‌ సత్తారు సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మంచి హిట్లు కొట్టారు. అర్జున్‌రెడ్డి సినిమాతో మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సందీప్‌ చూపిన ప్రతిభ అందరికీ తెలిసిందే. వెన్నెల కిశోర్‌ సాఫ్ట్‌వేర్‌ కొలువు వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించి మొదట్లో దర్శకత్వంపై దృష్టి సారించారు. ప్రస్తుతం హాస్య నటుడిగా అలరిస్తున్నారు. చాలామంది యువ దర్శకులు తాము చదువుకునే రోజుల్లోనే చక్కని కథలు, పాటలు రాసుకునేవారు. సరైన దారి లేకపోవడంతో వీరు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలా రోజులే పట్టిందని చెప్పాలి. తీసిన మొదటి సినిమాతోనే మంచి ప్రతిభ కనబరిచిన వీరికి ఇప్పుడు చిత్ర పరిశ్రమ జేజేలు పలుకుతోంది.   


సీన్‌ వివరిస్తున్న శేఖర్‌ కమ్ముల

సాఫ్ట్‌వేర్‌ కొలువు చేస్తూనే..  
మాది ఒంగోలు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మనవణ్ని. హైటెక్‌ సిటీలో 14 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. చదువుకునే సమయంలోనే కథల మీద బాగా ఇంట్రెస్ట్‌. ఇప్పుడిప్పుడే మంచి వేదిక దొరకడంతో క్షీరసాగర మథనం సినిమాకు దర్శకత్వం వహించా. గుండెల్ని మెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. భావోద్వేగాలతో మనసుల్ని రంజింపజేసి మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందిస్తున్నామన్న నమ్మకం నాకు ఉంది. దాదాపు అందరూ కొత్తవాళ్లతోనే ఈ సినిమా రూపొందించాను.      
– అనిల్‌ పంగులూరి,  ‘క్షీరసాగర మథనం’ దర్శకుడు 


దర్శకుడు సందీప్‌, అనిల్‌ పంగులూరి

సినిమాలపై మోజుతో..  
మాది విజయవాడ. ఎంటెక్‌ చదివా. కాలేజీ రోజుల్లోనే సినిమాలపై ఇంట్రెస్ట్‌ పెరిగింది. కథలు బాగా రాసుకునేవాణ్ని. ఎప్పటికైనా ఒక్క సినిమా అయినా తీయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చాను. ఫిలింనగర్‌లో ఎన్ని చోట్లకు తిరిగానో నాకే గుర్తు లేదు. ఈ క్రమంలో ఒక మంచి కథతో నేను వెళ్లగానే నిర్మాత అంగీకరించారు. అదే రామచక్కని సీత సినిమా. నాకు మంచి పేరు తీసుకొచ్చింది. 
– శ్రీహర్ష మందా, ‘రామచక్కని సీత’ దర్శకుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top