మహ కుంపటి..

 Seats Allocations Clashes in mahabubnagar Mahakutami Parties - Sakshi

 కాంగ్రెస్, మహాకూటమి అభ్యర్థుల ప్రకటనపై కొనసాగుతున్న సస్పెన్స్‌ 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో బీ–ఫామ్స్‌

హైదరాబాద్‌లో అందజేసిన పార్టీ అధినేత కేసీఆర్‌ 

నేడో, రేపో బీజేపీ అభ్యర్థులకు కూడా..  

 మహాకూటమి ఆశావహులకు మాత్రం ఇంకా ఎదురుచూపులు 

పొత్తులు, అభ్యర్థుల ఎంపిక తేలక ఆపసోపాలు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  అసలే టీఆర్‌ఎస్‌ అధికార పార్టీ.. అంతకు మించి అభ్యర్థుల ప్రకటన పూర్తయింది.. దీంతో వారు నియోజకవర్గాన్ని ఒకటి, రెండు సార్లు చుట్టేస్తున్నారు.. అంతేకాకుండా సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.. కానీ మహాకూటమి పొత్తుల ఇంకా తేలలేదు! రేపు, మాపంటూ అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేస్తుండగా.. ఏ సీటు ఏ పార్టీకి దక్కుతుందో అంతు పట్టడం లేదు.  దీంతో సీటు ఆశిస్తున్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
       ముందస్తు ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పక్షాలు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వడివడిగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ రద్దు అనంతరం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌... ఎక్కడా ఎన్నికల వేడి తగ్గకుండా ప్రచారంలో నిమగ్నమైంది. మరోవైపు అధికార పక్షాన్ని గద్దెదింపుతామంటూ శపథాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి పొత్తులు, అభ్యర్థుల లెక్కలు మాత్రం ఎంతకూ ఓ కొలిక్కి రావడం లేదు.

ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుండగా.. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభమవుతుంది. అయినా ఇప్పటికీ అభ్యర్థుల ప్రకటన వెలువడలేదు. వాయిదాలతోనే కాలం గడుపుతున్నారే తప్ప ఎంపిక ప్రక్రియ తేలడం లేదు. మరోవైపు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ నేతలు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. నేడో రేపో మిగిలిపోయిన అయిదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి బీ–పామ్‌లు అందజేయాలని నిర్ణయించింది. 

ఈ వారంలోనే కేసీఆర్‌ సభలు 
ఎన్నికల ప్రక్రియలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్‌ దళపతి, సీఎం కేసీఆర్‌ నాలుగైదు రోజుల్లో పాలమూరు ప్రాంతంలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థులతో సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై సూచనలు, సలహాలు చేశారు. సోమవారంఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండటంతో.. ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చాలని సూచించారు. త్వరలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారై ఫీల్డులోకి వచ్చేలోగా ప్రచారాన్ని ఒక విడత ముగించాలని స్పష్టం చేశారు.

    నాలుగైదు రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల పర్యటనలు ప్రారంభించనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ఈ నెల 17 నుంచి పాలమూరు జిల్లాలో సభలు ప్రారంభిస్తామని చెప్పగా.. మొదటగా దేవరకద్ర నియోజకవర్గంలోనే సభ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 17 దేవరకద్ర నియోజకవర్గ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అదే రోజు సాయంత్రం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన కేసీఆర్‌.. తేదీలను కూడా ఖరారు చేసి అభ్యర్థులకు చెప్పినట్లు సమాచారం. 

కాంగ్రెస్‌ అభ్యర్థులు తేలేదెన్నడో?! 
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న ధోరణి ఆ పార్టీ శ్రేణులను ఆయోమయానికి గురిచేస్తోంది. ఎన్నికల బరిలోకి దిగనున్న అభ్యర్థుల పేర్లను ఆరు నెలల ముందే ప్రకటిస్తామని పేర్కొన్న పీసీసీ చీఫ్‌.. ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలవుతున్నా. ఇప్పటికీ ప్రకటించకపోవడం గమనార్హం.అభ్యర్థుల ప్రకటన విషయంలో పలుమార్లు గడువులు చెప్పడం.. తీరా మళ్లీ వాయిదా వేయడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్‌ అధిష్టానం వైఖరి అదుగో పులి కథలా మారిందంటూ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

     సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలోనైనా అభ్యర్థుల ప్రకటన ఉంటుందా అనేది సందేహంగా మారింది. ఒక వేళ అభ్యర్థులను ప్రకటిస్తే అన్ని నియోజకవర్గాలకు ప్రకటిస్తారా లేదా ఏకాభిప్రాయం ఉన్న స్థానాలకు మాత్రమే ప్రకటిస్తారా అనే మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలా మొత్తం మీద కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది.

 
బీజేపీ మిగిలిన స్థానాలు.. 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొమ్మిది స్థానాలకు రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. మిగిలిన అయిదు స్థానాలకు సోమవారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలోనైనా ఉమ్మడి పాలమూరు నుంచి రెండు నుంచి మూడు స్థానాల్లో గెలిచి తీరాలని గట్టి కృషి చేస్తోంది. అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

   పెండింగ్‌లో మిగిలిపోయిన వాటిల్లో ఒకటైన మహబూబ్‌నగర్‌ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి పేరు ఖరారు చేసినా ఆఖరి నిముషంలో నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ స్థానం విషయమై పలు కోణాల్లో విశ్లేషిస్తున్న బీజేపీ అధిష్టానం.. ఇక్కడ నుంచి బరిలో ఎవరిని నిలుపుతుందనే ఆసక్తికరంగా మారింది. అదే విధంగా కొడంగల్‌ నుంచి పార్టీ సీనియర్‌ నేత నాగూరావు నామాజీని దాదాపు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జడ్చర్ల, కొల్లాపూర్, అలంపూర్‌ నియోజకవర్గాలకు కూడా స్థానికంగా పట్టు ఉన్న నేతలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top