రాజధానిలో సీ ప్లేన్‌ ప్రాజెక్టు! | Sea Plane Project To Come Up In Hyderabad | Sakshi
Sakshi News home page

రాజధానిలో సీ ప్లేన్‌ ప్రాజెక్టు!

Mar 9 2018 3:13 AM | Updated on Sep 4 2018 5:07 PM

Sea Plane Project To Come Up In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజధాని నగరాన్ని ఇతర నగరాలతో అనుసంధానం చేసేందుకు హుస్సేన్‌సాగర్‌ కేంద్రంగా సీ ప్లేన్‌ ప్రాజెక్టు నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం, ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయంలో గురువారం జరిగిన ‘వింగ్స్‌ ఇండియా’ విమానయాన సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

పారిశ్రామిక విధానంలో ఏరోస్పేస్, రక్షణ రంగాలను అత్యంత ప్రాధాన్య రంగాలుగా గుర్తించామని ఉద్ఘాటించారు. బోయింగ్, ఎయిర్‌ బస్, జీఈ, సఫ్రాన్, ప్రాట్‌ అండ్‌ విట్నీ, సీఎఫ్‌ఎం, బాంబార్డియర్, పిలాటస్, ఆర్‌యూఏజీ, కోబామ్, హనీవెల్, సాబ్, రాక్‌వెల్‌ కొల్లిన్స్‌ వంటి ప్రఖ్యాత ఏరో స్పేస్‌ కంపెనీలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏయిర్‌ ఇండియా, జీఎంఆర్‌ల ఆధ్వర్యంలో రెండు విమానాల మరమ్మతు, నిర్వహణ కేంద్రాలు ఉన్నాయన్నారు. అగ్రగామి విమాన ఇంజిన్‌ తయారీ కంపెనీలైన ప్రాట్‌ అండ్‌ విట్నీ, సీఎఫ్‌ఎంలు తమ విమాన ఇంజిన్ల తయారీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నాయన్నారు.

ఈ సంస్థలన్నీ రాష్ట్రానికి దేశ ఏరోస్పేస్, విమానయాన రంగ రాజధానిగా గుర్తింపు కలిగించాయన్నారు. ఇక్కడ ప్రధాన విమానయాన కంపెనీలన్ని మరమ్మతు, శిక్షణ, సాంకేతిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చాలా పరిశ్రమలకు మెగా పరిశ్రమల హోదా కల్పించి వాటికి అవసరమైన ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు.

కొత్త విమానాశ్రయాలు
ఏరో స్పేస్, విమానయాన కేంద్రాల్లో ఒకటిగా రాష్ట్రం ముందుకు వెళ్తోందని కేటీఆర్‌ తెలిపారు. దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న విమానాశ్రయాల్లో ఒకటైన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికులు, 1.35 లక్షల మెట్రిక్‌ టన్నుల సరుకుల రవాణా జరుగుతోందన్నారు. ఔషధ పరిశ్రమలు, ఏరో స్పేస్‌ రంగ విస్తరణలో విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ప్రపంచ స్థాయి కార్గో సదుపాయాలతో హైదరాబాద్‌ విమానాశ్రయం ఫార్మా రంగం కోసం ప్రత్యేక జోన్‌ను కలిగి ఉందన్నారు. రాష్ట్రంలో బేగంపేట, వరంగల్, హకీంపేట, దుండిగల్, నాదర్‌గుల్, రామగుండం విమానాశ్రయాలున్నాయని, వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా టెక్స్‌టైల్‌ పార్క్, ఐటీ హబ్‌ల అవసరాల కోసం అక్కడి విమానాశ్రయాన్ని క్రియాశీలం చేస్తామన్నారు.

కొత్తగూడెంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫిల్డ్‌ విమానాశ్రయంతో ఖమ్మం జిల్లా చుట్టూ ఉన్న బొగ్గు, విద్యుత్‌ పరిశ్రమలకు అనుసంధానం లభించనుందన్నారు.జక్రాన్‌పల్లిలో ప్రతిపాదించిన విమానాశ్రయం వల్ల హైదరాబాద్‌ ఫార్మాసిటీకి ప్రయోజనం కలగనుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ నారాయణ్‌ చౌబే, సంయుక్త కార్యదర్శి ఉషా పాధీ, ఫిక్కీ ఉపాధ్యక్షుడు సందీప్‌ సోమనీ పాల్గొన్నారు.  

అంతర్జాతీయ శిక్షణ
వియానయాన, ఏరో స్పేస్‌ రంగానికి అత్యున్నత నైపుణ్యం అవసరమని, ఇందుకు వైమానిక ఇంజనీరింగ్‌ విభాగంలో విదేశీ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఫ్రెంచ్‌ ఏరో స్పేస్‌ అకాడమీ, యూకేకు చెందిన క్రాన్‌ఫీల్డ్‌ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలోని ఎంబ్రీ రిడిల్‌ వర్సిటీ భాగస్వామ్యంతో టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ప్రారంభించామని చెప్పారు.

తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ గత ఐదేళ్లుగా అత్యుత్తమ విమానయాన శిక్షణ సంస్థగా కేంద్రం నుంచి పురస్కారాలు అందుకుందని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ ఏవియేషన్‌ వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏవియేషన్‌ టర్బైన్‌ ఇంధనంపై వ్యాట్‌ తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement