కలెక్టరేట్‌ నిర్మాణంలో కుంభకోణం

 scam in Collectorate construction - Sakshi

మంత్రి జగదీశ్‌రెడ్డిపై కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డి ఆరోపణ  

ఈ వ్యవహారంలో హైకోర్టుకు వెళతాం

సూర్యాపేట: కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ నిర్మాణంలో రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్‌.దామోదర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వారు ఇక్కడ  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘పేట’పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేది పోరాటాలని, అలాంటి పోరాటాల గడ్డలో  జగదీశ్‌రెడ్డి అనే చీడ పురుగు ప్రజలను మోసం చేసేందుకు.. ముసుగు తగిలించుకొని వస్తున్నారని అన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చుట్టూ కిలోమీటర్‌ నుంచి రెండున్నర కిలోమీటర్ల పరిధిలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా.. ప్రైవేటు భూములను ముందుగానే బినామీల పేరుపై కొనుగోలు చేసి వాటిల్లో కలెక్టరేట్‌ నిర్మాణం చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. ప్రైవేటు భూములను దళితుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి వారిని మోసం చేశారన్నారు. ఈ భూములను 2016లోనే కొనుగోలు చేయడంలో కుట్ర దాగి ఉందని విమర్శించారు.

ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా మంత్రి ప్రైవేటు భూములపై ఎందుకు అంత ప్రేమ చూపుతున్నారో ప్రజలకు అర్థమైపోయిందన్నారు. జిల్లా కలెక్టర్‌ 671 సర్వేనంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిలో కలెక్టరేట్‌ నిర్మాణం చేస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపించినప్పటికీ.. మంత్రి అవేమీ పట్టించుకోకుండా తనకు అనుకూలమైన ప్రైవేటు భూముల్లో కలెక్టరేట్‌ నిర్మాణం చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కలెక్టరేట్‌ నిర్మాణం వ్యవహారంలో హైకోర్టుకు వెళతామని వారు అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో జగదీశ్‌రెడ్డికి 2వేల ఓట్లు కూడా రావన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మంత్రే అవినీతికి పాల్పడటం బాధ కలిగిస్తోందని అన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలసి నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్‌ను దారుణంగా హత్య చేయించారన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడిన కాల్‌డిటెయిల్స్‌ కూడా తీయిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేశ్‌రెడ్డి, మరో నేత కొప్పుల వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top