ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం శాసనసభలో కొత్త సంస్కృతికి బాటలు వేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం శాసనసభలో కొత్త సంస్కృతికి బాటలు వేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ఏ పార్టీ తరపున ఎవరు మాట్లాడాలో, బీఏసీలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు సభ్యులుండాలో కూడా అధికార పక్షమే నిర్ణయిస్తోందని ధ్వజమెత్తారు.
బీఏసీలో పార్టీల బలాబలాల ఆధారంగా సభ్యులుంటారని, టీడీపీ నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం ఇవ్వమంటే రేవంత్‌రెడ్డి తప్ప వేరే వారిని నియమించుకోమని చెపుతున్నారని ఆరోపిం చారు. సభలో రేవంత్‌రెడ్డిని మాట్లాడనీయకుండా గొడవకు దిగుతుంటే స్పీకర్ కూడా అధికారపక్షానికే వంత పాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఫ్లోర్ లీడర్లతోపాటు ఇతర సభ్యులు కూడా బిల్లుపై తమ అభిప్రాయాలు చెప్పగా, రేవంత్ మాట్లాడేందుకు లేస్తే ఫ్లోర్‌లీడర్ మాత్రమే మాట్లాడాలని స్పీకర్ ఆర్డర్‌ఇచ్చారని, ఇతర సభ్యులకు, టీడీపీ సభ్యులకు మధ్య తేడా ఎందుకని ప్రశ్నించారు.