రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్‌?

salary bonus for revenue staff who participated in land records purgation - Sakshi

భూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొన్న వారికిచ్చే యోచన

ఏప్రిల్‌ నెల జీతంతోపాటు జమ చేయనున్న ప్రభుత్వం!

రూ.18 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా

అందరికా..? ప్రత్యక్షంగా పాలుపంచుకున్న వారికేనా?

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగు నెలలుగా భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న రెవెన్యూ సిబ్బందికి నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉన్నతస్థాయి వర్గాల్లో కసరత్తు జరుగుతోంది. ఎప్పుడో నిజాం నవాబు నాటి రికార్డులను ఎంతో శ్రమకోర్చి ప్రక్షాళన చేసిన క్షేత్రస్థాయి వీఆర్వోలు, వీఆర్‌ఏల నుంచి సీసీఎల్‌ఏ సిబ్బంది వరకు ఈ ప్రోత్సాహకాన్ని ఇస్తారని, ఏప్రిల్‌ నెల జీతంతోపాటు బోనస్‌ వస్తుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ఏం చేద్దాం.. ఎలా చేద్దాం
వాస్తవానికి భూ రికార్డుల ప్రక్షాళనలో పాల్గొన్న రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ గత నెలలోనే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. మరోవైపు ఈ ప్రోత్సాహకం విషయంలో ఏం చేద్దామన్న దానిపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (టీఆర్‌ఎస్‌ఏ) ప్రతిపాదిస్తున్న విధంగా సిబ్బంది మొత్తానికి నెల జీతం బోనస్‌గా ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.18 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడనుందని రెవెన్యూ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అయితే రెవెన్యూ శాఖలో పని చేస్తున్న మొత్తం 40 వేల మంది సిబ్బందికీ బోనస్‌ ఇవ్వాలా లేదా భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న వీఆర్‌ఏలు, వీఆర్వోలు, తహసీల్దార్లు, ఇతర కార్యాలయ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆర్డీవో కార్యాలయాల నుంచి కలెక్టర్, సీసీఎల్‌ఏ కార్యాలయాల సిబ్బంది వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందున అందరికీ బోనస్‌ వర్తింపజేయాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు బోనస్‌ ఎవరికి ఇస్తారన్నది త్వరగా తేల్చి వీలుంటే మార్చి లేదా ఏప్రిల్‌ నెల జీతంలో బోనస్‌ జమ చేస్తారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top