రైతుబంధుకు సన్నద్ధం

Rythu Bandhu Scheme Money Distribution Arrangements Telangana - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఖరీఫ్‌లో పంటల సాగుకు రైతుబంధు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు వ్యవసాయశాఖ అధికారులు సైతం సన్నద్ధమవుతున్నారు. ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 4వ తేదీన ఉండటంతో ఆ ఓట్ల కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే ఈ–కుబేర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతలకు ఆసరాగా నిలుస్తోంది. ఆర్థిక స్థోమత లేని రైతులకు ఈ పథకం వరంగా మారింది.

ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు రబీ, ఖరీఫ్‌ సీజన్లలో పంట పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు చెక్కుల రూపంలో ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇవ్వగా.. రబీలో అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ కారణంగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈసారి వానాకాలం పంట (ఖరీఫ్‌) కోసం కూడా రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమ చేయనున్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఈసారి ఎకరాకు రూ.5 వేల చొప్పున ఇవ్వనుండటంతో రైతాంగంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

పెట్టుబడి సాయం పెంపు 
2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం రూ.2 వేలు పెంచనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో రెండు పంటలకు కలిపి రూ.8 వేలు ఉన్న సహాయాన్ని ఈ ఏడాది ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.10 వేలు చెల్లించనున్నారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రైతులు తమ వ్యవసాయ పంట క్షేత్రాల్లో పంటల సాగుకు పెట్టుబడి కోసం గతంలో బ్యాంకుల ముందు నిరీక్షించాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుంటున్నారు. గతంలో బ్యాంకు అధికారులు రుణాల కోసం సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసేవారు. ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయంతో రైతులకు ఆ ఇబ్బందులన్నీ తప్పినట్లయింది. వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పు రైతులకు భారంగా మారి ఆత్మహత్యలు చేసుకునేవారు. వ్యాపారుల వడ్డీ కిందకే పండించిన పంట ఇవ్వాల్సి వచ్చేది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసి సాయం చేసింది.

గత ఖరీఫ్‌ సీజన్‌లో.. 
గత ఖరీఫ్‌ సీజన్‌లో రైతుబంధు పథకం అమలులో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని 3,35,252 మంది రైతులకు రూ.355.21 కోట్లు మంజూరు చేయగా రూ.219.67 కోట్ల పెట్టుబడి సాయం కింద 2,87,128 మంది రైతులకు అందింది. వివిధ కారణాలతో రూ.136.21 కోట్లు రైతులకు అందలేదు. రబీ సీజన్‌లో రూ.342.12 కోట్లు జిల్లాకు విడుదల కాగా అందులో రూ.307.7 కోట్లు పెట్టుబడి కింద 2,62,612 మంది రైతులకు పంపిణీ చేశారు. పలు కారణాల వల్ల పంపిణీకి నోచుకోని రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయం పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. ఆనాడు నిలిచిపోయిన పెట్టుబడి పంపిణీపై వ్యవసాయ శాఖాధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు. కాగా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగు చేయడం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాలన్లి రైతులు కోరుతున్నారు.

గతేడాది రూ.697.33 కోట్లు 
2018–19 ఖరీఫ్‌లో 2,82,783 మంది రైతులకు రూ.219.67 కోట్లు అందించారు. అలాగే రబీ సీజన్‌లో 2,62,612 మంది రైతులకు రూ.307.7 కోట్లు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం కింద జిల్లాకు రూ.697.33 కోట్లు కేటాయించినా రూ.526.33 కోట్లు మాత్రమే పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడం గమనార్హం.
 
సమస్యలు అధిగమించేనా..? 
గతేడాది ఖరీఫ్‌ నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ చేపట్టారు. కొంతమంది భూస్వాములు, విదేశాల్లో ఉన్న వారు చెక్కులు తీసుకోలేదు. రెవెన్యూ రికార్డుల్లో తలెత్తిన గందరగోళంతో పలువురు చెక్కులు వచ్చినా తక్కువ భూమికి వచ్చాయని తీసుకోలేదు. దీంతో భారీగా చెక్కులు మిగిలిపోయాయి. యాసంగి సమయంలో ఎన్నికల కోడ్‌ వల్ల చెక్కుల పంపిణీపై ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ ముద్రించిన చెక్కులను పక్కన పెట్టి రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసింది. అయితే ఇతర దేశాలు, పట్టణాల్లో ఉన్న వారు బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకపోవడంతో వారికి పెట్టుబడి సాయం అందలేదు. దీంతో 88,738 మంది రైతులు రూ.171.28 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందుకోలేకపోయారు. ఇటీవల యాసంగికి సంబంధించిన చెల్లింపులన్నీ పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖాధికారులు వెల్లడించారు. 

నేరుగా ఖాతాల్లో జమ 
ఖరీఫ్‌ పంటకు సంబంధించి రైతుబంధు పథకం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పెట్టుబడి సాయం పంపిణీ కొంత ఆలస్యమైంది. జిల్లా రైతులకు రైతుబంధు సాయం పంపిణీపై చర్యలు చేపడతాం. ప్రస్తుత సీజన్‌ నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తాం. జిల్లాలో ఇంకా కొంత మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు సేకరించాల్సి ఉంది. ఏఈఓల ద్వారా వారి ఖాతా నంబర్లు సేకరిస్తాం. – సుచరిత, జేడీఏ, మహబూబ్‌నగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top