ఆర్టీసీ బస్సు – టిప్పర్‌ ఢీ | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు – టిప్పర్‌ ఢీ

Published Mon, Sep 18 2017 2:34 AM

ఆర్టీసీ బస్సు – టిప్పర్‌ ఢీ - Sakshi

ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
చండ్రుగొండ:
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చండ్రుగొండ– అన్నపురెడ్డిపల్లి మండలాల సరిహద్దులో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు, బొగ్గు టిప్పర్‌ ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 27 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లా కనిగిరికి వెళ్తుండగా.. సత్తుపల్లి సింగరేణి ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గులోడుతో వస్తున్న వోల్వో టిప్పర్‌ మద్దుకూరు వద్ద వేగంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన టిప్పర్‌ రోడ్డుదిగి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో అది ముక్కలైంది. టిప్పర్‌ ఇంజన్, ట్రక్కు రెండు భాగాలుగా విడిపోయాయి.

మరో వైపు అదేవేగంతో ముందుకు వెళ్లిన బస్సు రోడ్డుపక్కన తుప్పల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో డ్రైవర్‌ వెనుక సీట్లో కూర్చున్న పాల్వంచ మండలం సంగం గ్రామానికి చెందిన శంషున్నీసాబేగం(65), సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన టిప్పర్‌ క్లీనర్‌ కిచ్చపాటి వెంకటరెడ్డి (48) అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కొత్తగూడెంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీఐ సంపత్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement