సగానికి చేరువగా...

Rs 143 Crore Income From Registration In Telangana - Sakshi

రూ.143 కోట్లకు చేరిన రిజిస్ట్రేషన్ల ఆదాయం

మొత్తం లావాదేవీలు 53వేల పైమాటే..

గత నాలుగైదు పనిదినాల్లో రోజుకు రూ.10 కోట్లు

ఈ నెలాఖరుకు రూ.200 కోట్ల వరకు వచ్చే అవకాశం

సాధారణ పరిస్థితుల్లో ఆదాయం నెలకు రూ.500 కోట్లపైమాటే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22 నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌ సేవలు మళ్లీ ఈ నెల 6 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ 20 రోజుల్లో ఆదాయం రూ.143 కోట్లు దాటింది. సాధారణ సమయాల్లో రోజుకు సగటున 20–25 కోట్ల వరకు ఆదాయం రానుండగా, లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తర్వాత ప్రస్తుతానికి అది రూ.7 కోట్ల వరకు వచ్చింది. అయితే, ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు పెద్దగా లావాదేవీలు జరగకపోయినా ఆ తర్వాత ఊపందుకుని 14వ తేదీ నాటికి రోజుకు రూ.10 కోట్ల వరకు ఆదాయం వచ్చే స్థితికి చేరింది. ఇప్పుడు అది రూ.15 కోట్ల వరకు వచ్చిందని, జూన్‌ నెలలో దాదాపు సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెపుతున్నారు. 

మరికొంత సమయం.. 
వాస్తవానికి, గత మార్చి 22 వరకు రిజిస్ట్రేషన్ల శాఖలో కాసుల పంట పండింది. గతంలో ఎన్నడూ లేనట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ శాఖ ఆదాయం రూ.6,200 కోట్లకు పెరిగింది. కానీ, ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఒక్కసారిగా ఊపందుకోలేదని, ఇందుకు పలు కారణాలున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల వద్ద నగదు లభ్యత, చేతులు మారడం తక్కువగా ఉంటుందని, దీంతో పాటు రిజిస్ట్రేషన్‌ లావాదేవీల్లో భాగస్వాములు కావాల్సిన వారు ఇతర రాష్ట్రాల్లో ఉంటే వచ్చేందుకు అవకాశం లేకపోవడం కూడా కారణమవుతోందని చెపుతున్నారు.

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇతర పెద్ద ప్రాజెక్టులకు బ్యాంకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియకు కూడా ప్రతికూలత ఉందని అంటున్నారు. ఇక, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఖచ్చితంగా భౌతికదూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కో లావాదేవీ పూర్తి చేసేందుకు సాధారణ పరిస్థితుల కంటే ఎక్కువ సమయం పడుతున్న కారణంగా కూడా డిమాండ్‌ మేరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లావాదేవీలు పూర్తి కావడం లేదు. మొత్తంమీద భారీ స్థాయిలో కాకపోయినా ఇప్పటికే రిజిస్ట్రేషన్ల లావాదేవీలు సగానికి చేరుకోవడం ఆశాజనకమేనని, లాక్‌డౌన్‌ నిబంధనలు మరికొంత సడలిస్తే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

2,500కు పైగా లావాదేవీలు..
గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 5,500–6,000 వరకు రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగేవి. లాక్‌డౌన్‌ తర్వాత ఆ సగటు 2,500 వరకు వచ్చింది. గత 20 రోజుల్లో 53,836 లావాదేవీలు జరిగాయి. అయితే, గత నాలుగైదు రోజులుగా 3వేలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే సరళి కొనసాగితే ఈనెలాఖరుకు రూ.200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంమీద సాధారణ సమయాల్లో నెలకు రూ.500 కోట్లకు పైగా వచ్చే రిజిస్ట్రేషన్ల ఆదాయం మే నెలలో సగానికి దగ్గరగా రావడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top